నారా భువనేశ్వరి తమకు సోదరి లాంటిదన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. అట్లాంటిది తామెందుకు తప్పుగా మాట్లాడుతామని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు దూషించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించడంపై బాలినేని స్పందించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు తీవ్ర అసహనంలో ఉన్నారని, అందుకే అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని ఆయన కొట్టిపారేశారు.
‘‘భువనేశ్వరి మాకు సోదరి వంటిది. ఆమె గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మేమే సహించం. అలాంటిది మా పార్టీ నేతలు ఆమెను ఎందుకు దూషిస్తారు’’ అని ప్రశ్నించారు మంత్రి బాలినేని. అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడితే సీఎం జగన్ ఏమాత్రం సహించరని స్పష్టం చేశారు.
నిన్నటి సభా సమావేశాల్లో చంద్రబాబే వివేకా హత్య కేసు నేపథ్యంలో వైఎస్ కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మంత్రులు భువనేశ్వరిని తిట్టారనడంలో వాస్తవం లేదన్నారు బాలినేని. వారు మాధవరెడ్డి, వంగవీటి రంగా హత్యల గురించి చర్చించాలని మాత్రమే అన్నారని బాలినేని ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..