ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పరిణామాల తర్వాత.. మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సీఎం అయ్యే దాకా అసెంబ్లీలో అడుగు పెట్టబోనని శపథం చేశారు. ఆ ఘటనపై ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖబడ్దార్ అంటూ బాలకృష్ణ వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా రోహిత్ సహా అందరూ పెదవి విప్పారు.
అయితే.. అందరూ స్పందించినా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మాత్రం ఇప్పటిదాకా ఈ వ్యవహారంపై రెస్పాండ్ కాలేదు. తాజాగా ఆమె తన భావాలను వ్యక్తీకరించినట్టు తెలుస్తోంది. బాబు ఏడ్వడాన్ని చూసి భువనేశ్వరి కూడా ఇంట్లో భోరున విలపించారని సమాచారం. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ అవ్వగానే ఇంటికి వెళ్లిన చంద్రబాబు, నారా లోకేశ్ ను చూసి ఆమె మరింత ఏడ్చారని అంటున్నారు. ఆ తర్వాత వెంటనే కోలుకున్న ఆమె.. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దని తన భర్తకు చెప్పినట్టు సమాచారం.
‘‘దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి. రాజకీయాల్లో ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారి హయాంలోనూ కొందరు అలాగే మాట్లాడేవారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటివి మాట్లాడుతారు. మనసుకు బాధనిపిస్తుంది. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. పక్కకు పడేసి మన పని మనం చేసుకుపోవాలి’’ అంటూ ఆమె చంద్రబాబును అనునయించారని తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..