ఒంగోలు, ప్రభన్యూస్ బ్యూరో:తెలుగుదేశం పార్టీ ఒంగోలులో ఈ నెల 27,28 తేదిల్లో నిర్వహించనున్న మహానాడు ప్రాంగణానికి బుధవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు. ఒంగోలు శివారులోని త్రోవగుంట సమీపంలో బృందావన్ ఫంక్షన్ హాలు వెనుక వైపు సుమారుగా 82 ఎకరాల సువిశాలమైన ఖాళీమైదానంలో జరిగే మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టేందుకు ముందు లాంఛనంగా ఉదయం 10.45గంటలకు భూమి పూజ చేశారు. ప్రాంగణంలో వేదిక, గ్యాలరీ, పార్కింగ్ ఏర్పాట్లు ఎలా చేయాలో కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. మహానాడు నిర్వహణకు భూములు ఇచ్చిన మండవవారిపాలెం ప్రజలతో మాట్లాడి..భూములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహానాడు ఎక్కడైనా విజయవంతం అవుతుందని. అది రుజువు చేయడానికే ఈ సారి ఒంగోలులో నిర్వహిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.
మహానాడును విజయవంతం చేయడానికి, నాయకులతో పాటు, కార్యకర్తలు, గ్రామస్థులు సహకారం అందించాలని కోరారు. మాహానాడుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులుండకుండా గుంటూరు నుంచి ఒంగోలు వరకు వివిధ ప్రాంతాల్లో బస, వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. . మహనాడు భూమి పూజ కార్యక్రమంలో అచ్చెన్నాయుడుతో పాటు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, దామచర్ల సత్య, నియోజవర్గ ఇన్‌ఛార్జిలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒంగోలులో ఈ నెల 27,28 తేదిల్లో రెండు రోజుల పాటు మహానాడు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, మహానాడుకు సంబంధించి ఎజెండాను పార్టీ ఖరారు చేసింది. దీని ప్రకారం 27వ తేది ఉదయం 9గంటలకు ప్రతినిధుల నమొదుతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలుత ఫోటో ఎగ్జిబిషన్, అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నివేదికలు సమర్పిస్తారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభోపన్యాసం చేస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన తీర్మాణాల పై చర్చలు జరుగుతాయి. రెండవ రోజు 28వ తేది టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తారు. 40 వసంతాల తెలుగుదేశం పార్టీ పై చర్చాగోష్టి ఉంటుంది. సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..