కర్నూలు, (ప్రభ న్యూస్) : తమ అభిమాన హీరోని ప్రత్యక్ష దైవంగా భావించే అభిమానాన్ని అక్రమ మార్గాన సొమ్ము చేసుకునేందుకు ఎప్పటిలాగా మరో మారు కొన్ని థియేటర్ల యాజమాన్యాలు సర్వదా సిద్ధమయ్యాయి. కోట్లాది అభిమాన గణం గల హీరో సినిమా విడుదలవుతుందంటే దాదాపు వారం రోజుల పాటు థియేటర్లలో కాసుల వర్షం హిట్లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా కురుస్తుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్‌టిఆర్, రామ్‌చరన్, చిరంజీవి, బాలక్రిష్ణ వంటి అగ్రహీరోల సినిమా విడుదల రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి. ఇదే పండుగను క్యాష్ చేసుకునేందుకు థియేటర్లు సిద్ధం కావడంలో తప్పేమీ లేనప్పటికీ నిబంధనలు గాలికి వదిలి మరీ దారుణంగా టికెట్ల రేట్లు పెంచి దోచుకోవడం సబబు కాదన్నది అభిమానుల మాట.
మొదటి రోజు తమ హీరో సినిమా ఎలాగైనా చూడాలనుకున్న వీరాభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మామూలు టికెట్ల ధరలపై అధనంగా రూ.300 నుండి రూ.500 దాకా పెంచి అమ్ముతున్నారు. మండల కేంద్రాలలోని థియేటర్ల నుండి నగరంలోని మల్టిప్లెక్స్‌ల దాకా ఇదే తంతు. ప్రతి సారి బడా హీరోల సినిమాలు విడుదలైనప్పుడు బ్లాక్ దందా నడుస్తుందని తెలిసినా అధికారులు సైతం మౌనవ్రతం దాల్చడంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. సామాన్యుడు సైతం మొదటిరోజు తమ అభిమాన హీరో సినిమా చూడాలని టికెట్ల రేట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓను విడుదల చేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను స్థానిక థియేటర్ యాజమాన్యాలు, కొందరు అధికారులు సైతం తుంగలో తొక్కుతున్నారు.
పేరుకే ఆన్‌లైన్ .. అంతా ఆఫ్‌లైన్‌లోనే
తమ అభిమాన హీరో పవన్‌కళ్యాణ్ సినిమా నేడు విడుదలవుతుందని ఒకరోజు ముందే ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్న అభిమానులకు చేదు అనుభవం ఎదురవుతున్నది. ఆన్‌లైన్‌లో టికెట్ కౌంటర్ ఏర్పాటుచేసినట్లు చూపుతున్నప్పటికీ అన్ని థియేటర్లు, అన్ని షోలు పూర్తిస్థాయిలో టికెట్లు బుక్ అయినట్లు చూపడం సదరు అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తున్నది. థియేటర్ల వద్దకు వెళితే షోల్డ్ అవుట్ బోర్డులు పెట్టి ఆన్‌లైన్‌లో బుకింగ్‌చేసుకోమని అక్కడి సిబ్బంది చెబుతుండటంతో పవన్ అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. పట్టణంలో పేరున్న బడా బాబులకు వారి మిత్రులకు రాజకీయ నాయకులకు, వారి అనుచరులకు అధిక రేట్లకు ముందు రోజే అమ్మడం ఆనవాయితీగా వస్తోంది. ఏదో ఒకచోట ఒకరిద్దరు అధికారులు చెకింగ్‌లకు వస్తారన్న భయంతో బుకింగ్‌లో టికెట్లు అమ్ముతున్నట్లు కలరింగ్ ఇవ్వడం కోసం 10, 20 టికెట్లను ఇచ్చి షోల్డ్ అవుట్ బోర్డులు పెట్టి థియేటర్ యాజమాన్యాలకు వెన్నతో పెట్టిన విద్య. జిల్లా కేంద్రమైన కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరులలోని చాలావరకు థియేటర్లలో ఇదే తంతు జరుగుతుంది.
నగరంలోని కొన్ని మల్టిప్లెక్స్ థియేటర్లలో గత కొద్దిరోజులుగా నయా దందాకు తెరలేపారు. బడా హీరోల సినిమాలకు టికెట్ ధర ఎంత పెట్టినా తీసుకుంటారన్న ఆలోచనతో టికెట్లను అధిక ధరలకు అమ్మితే ప్రభుత్వం నుండి ఇబ్బందులు వస్తాయన్న ముందుచూపుతో మరో మార్గంలో బ్లాక్ దందాకు తెర తీస్తున్నారు. టికెట్ కావాలంటే కూల్‌డ్రింక్, స్నాక్స్ తీసుకుంటేనే ముఖ్యంగా రూ.500కు తగ్గకుండా బిల్ చేస్తేనే ఒక టికెట్ ఇస్తామని బుకింగ్ కౌంటర్‌లోనే చెబుతున్నారు. తమకు ఎలాంటి స్నాక్స్ వద్దని చెబితే టికెట్లు ఇవ్వమని చెప్పడం విశేషం. ఈ తతంగం బడా హీరోల సినిమాలు విడుదలైన ప్రతి సారి జిల్లా అధికారుల దృష్టికి వచ్చినా ఒకటి, రెండుసార్లు మెరుపు దాడులు చేయడంతోనే సరిపెడుతున్నారు. నేడు విడుదలవుతున్న భీవ్లూనాయక్ సినిమా సైతం బ్లాక్ దందా చట్రంలో ఇరుక్కుపోయిందనే చెప్పవచ్చు. గురువారం నుండే ఆన్‌లైన్‌లో అన్ని థియేటర్లు, అన్ని షోలు బుక్ పూర్తయినట్లు చూపడం బుకింగ్‌లో టికెట్లు ఇవ్వమని బోర్డులు పెట్టడం ఇప్పటికే జరిగిపోయింది. అంటే సామాన్య అభిమాని పవన్‌కళ్యాణ్ సినిమా చూడాలంటే మరో నాలుగు, ఐదు రోజులు వేచిచూడక తప్పదు. థియేటర్ల యాజమాన్యాలపై ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేవిధంగా చర్యలు చేపట్టేలా కౌన్సిలింగ్ ఇవ్వకపోతే ఈ దోపిడీ యథేచ్చగా సాగుతూనే ఉంటుంది.