Sunday, November 3, 2024

AP: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్ష విరమణ..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : శ్రీ శోభకృత్ నామ సంవత్సర భవాని దీక్షల విరమణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భవాని దీక్షల విరమణ ఘట్టాన్ని ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. వేల సంఖ్యలో భవానీలు ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. జై భవాని జై దుర్గ భవాని నామస్మరణతో ఇంద్రగిరుల చుట్టూ మారుమోగుతుంది.

ఉదయం శ్రీ అమ్మవారి దర్శనం ప్రారంభమైన అనంతరం హోమగుండంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు, ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివ ప్రసాద శర్మ వైదిక కమిటీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం చండీ హోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్యుల నేతృత్వంలో నిర్వహించారు.

అమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు..

- Advertisement -

కనకదుర్గమ్మ దర్శనం కోసం భవాని భక్తులు ఉదయం నుండి గిరి ప్రదక్షిణ అనంతరం వినాయక గుడి నుండి ప్రారంభమయ్యే క్యూలైన్ల ద్వారా ఘాట్ రోడ్ మీదుగా విశేషంగా దేవస్థానం చేరుకొని అమ్మవారిని దర్శించుకొని, శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు చేరుకుని, హోమగుండం ఎదురుగా ఏర్పాటు చేసియున్న ఇరుముడి పాయింట్ల వద్ద భక్తులు ఇరుముడులు సమర్పించి, ముడుపులు, కానుకలు సమర్పించుకుంటున్నారు.

భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ..

భవాని మాల ధారణతో అమ్మవారి దర్శనానికి వచ్చి మాల విరమణ అనంతరం అందరికీ సరిపడినంత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహనాధికారి కేఎస్ రామారావు భక్తులకు అన్నప్రసాదంను స్వయంగా వడ్డించారు. భక్తులు అమ్మవారి అన్నప్రసాదమును స్వీకరిస్తున్నారు. పలువురి భవాణీ భక్తులను దీక్షా విరమణ ఏర్పాట్లపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకొనగా.. భక్తులు సంతృప్తిని వ్యక్తపరిచారు. విశేషంగా విచ్చేస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా చైర్మన్ కార్యనిర్వాహనాధికారి వారు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భవానీలతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement