- రామచంద్ర యాదవ్ డిమాండ్, కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడి
- ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం..
- ముఖ్య అతిథిగా మార్గనిర్దేశం చేసిన హాస్య నటుడు బ్రహ్మానందం
- మహిళలకు స్ఫూర్తి సందేశం నింపిన రేణు దేశాయ్
- రాజకీయాలకు అతీతంగా దేశంలోనే తొలిసారి ఈ వేడుకలు.
పుంగనూరు, (ఆంధ్రప్రభ) : “సావిత్రీబాయి ఫూలే జయంతి, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం” సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ లో వేడుకలు నిర్వహించారు. ఆమె జీవిత పాఠాలను ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు తమకు ఆపాదించుకుని భావితరాలకు ఉత్తమ పౌరులను అందించాలని పిలుపునిచ్చారు.
పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, ప్రముఖ నటి, సామాజిక సేవకురాలు రేణు దేశాయ్, జాతీయ బీసీ ప్రముఖులు, డిల్లి విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ సూరజ్ మండల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వక్తలు కీలక సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 125 మంది మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి పార్టీ తరపున అవార్డులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపిక అందించారు.
ఫూలే గారికి భారతరత్న ఇవ్వాలి: ఆర్సీవై!
దేశంలోని మహిళల కోసం, పేదల కోసం, ఆడపిల్లల చదువుల కోసం జీవితాన్ని ధారపోసిన సావిత్రిబాయి ఫూలే గారికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.. ఈ మేరకు తాను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకి పార్టీ తరపున తాను లేఖ రాస్తానని తెలియజేసారు.
ఆడపిల్లలు బయటకు వస్తేనే తప్పు అనుకునే దశలో ఫూలే ఇంట్లో భర్త సాయంతో చదువుకుని.. తను దేశంలోనీ మహిళా విద్యకు ఆరంభ జ్యోతి వెలిగించారన్నారు.. ఆమె చదువుకుని, నేర్చుకుని.. కోట్లాది మందికి స్పూర్తి పాఠంగా నిలిచారని తెలిపారు. 1948లో ఆడపిల్లల కోసం ఒక పాఠశాలను స్థాపించి.. అనతికాలంలో 20 విద్యాలయాలు నెలకొల్పిన ఫూలే దంపతుల సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువేనని ఆయన అన్నారు.
1890 వ దశకంలో దేశాన్ని వణికిస్తున్న ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూ.. ఆమె కూడా అదే వ్యాధి బారిన పడి మరణించారంటే.. ఆమె సమాజ సేవ, దేశ సేవ, మహిళా చదువులు, ఆడపిల్లల హక్కుల కోసం ఎంతగా పాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుందని.., ఉపాధ్యాయులకు స్ఫూర్తితో పాటు, సావిత్రీబాయి సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉందన్నారు.. బీసీ యువజన పార్టీ తరపున ఏటా ఇంకా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు..!
విలువైన విషయాలు పంచుకున్న బ్రహ్మానందం!
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటులు, పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ.. స్త్రీ చదువుకుంటే సమాజాన్ని, దేశాన్ని జయించగలరని అన్నారు. దశాబ్దాల కిందట ఉన్న సాంఘిక దురాచారాలు ఇప్పటికీ అక్కడక్కడ కొనసాగుతున్నాయి.. అవి పోవాలంటే స్త్రీలు పూర్తిస్థాయిలో చదువుకోవాలని పేర్కొన్నారు.
గురజాడ అప్పారావు రచన కన్యాశుల్కంలో కొన్ని విలువైన అంశాలను పంచుకున్నారు.. సావిత్రీ బాయి ఫూలే జీవితాన్ని ప్రతి మహిళా ఉపాధ్యాయురాలు ఆదర్శంగా తీసుకుని వృత్తిలో రాణించాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు సంతోషంగా ఉందనీ, కార్యక్రమం నిర్వహించిన రామచంద్ర యాదవ్ గారిని అభినందించారు.. ఆయన గొప్పవాడు అనేకంటే ధన్యుడు, ధన్యజీవి అని పేర్కొన్నారు..!
ఆ ప్రాంతంలో జన్మించడం నా సుకృతం: రేణు దేశాయ్!
సావిత్రీబాయి ఫూలే జన్మించిన ప్రాంతంలోనే తను జన్మించడం తన పూర్వ జన్మ సుకృతమని, ఎంతో గర్వంగా ఉంటుందని సినీ నటి, సామాజిక సేవకురాలు రేణు దేశాయ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. చిన్న నాటి నుండి సావిత్రీబాయి కథలు వింటూ, చదువుతూ పెరిగాం.. ఇప్పుడు ఆమె గురించి నిర్వహిస్తున్న కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మాట్లాడడం ఆనందంగా ఉంది.. ఆమె సేవలు దేశంలో ఎన్నేళ్లయినా చెరిగిపోవు, చెదిరిపోవు.. ఆడపిల్లలు చదువు కోసం ఆ నాడు ఆమె పోరాడకపోతే.., ముందడుగు వేయకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో..!? ఇటువంటి ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం నిర్వహించిన రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు.. ఆయన సేవలు నేను చాలా విన్నాను.. గత ఏడేళ్లుగా ప్రజా జీవితంలో ఉంటూ, అనేక సామాజిక సేవా కార్యక్రమాలను స్వయానా నిర్వహించడం, రాజకీయాలకు అతీతంగా బాధ్యత తీసుకుని ఇటువంటి ఉత్తమ కార్యక్రమం నిర్వహించడం అభినందనీమని రేణు దేశాయ్ పేర్కొన్నారు..!!
ఆద్యంతం అలరించిన కార్యక్రమం..!!
మహిళా ఉపాధ్యాయులకు ఇలా అవార్డులు ఇవ్వడం.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం అరుదైన సందర్భం.. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భారీ స్థాయిలో ఉపాద్యాయులు, వారి కుటుంబ సభ్యులు హాజరవ్వడంతో కార్యక్రమం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగింది.. మహిళా ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పార్టీ తరపున ప్రత్యేకంగా తయారు చేయించిన మెమొంటో సహా, పురస్కార ప్రశంసా పత్రం, బ్యాగు, పెన్ను తదితర కిట్టును అందించారు.. బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.