Saturday, November 23, 2024

AP | కాయ్‌ రాజా..! కాయ్‌..!! తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్‌లు

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలో తెలంగాణ ఎన్నికల వేడి సెగ తగులుతోంది. ఈ నెల 30న జరిగే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నువ్వా? నేనా? అనే రీతిలో తలపడుతున్నాయి. అక్కడ ఉత్కంఠ భరితంగా ఎన్నికలు సాగుతుండటంతో ఏపీ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ప్రభావం చూపుతుందనే రాజకీయ పరిశీలకుల అంచనాల నేపధ్యంలో.. ఏపీ ప్రజల ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు రాజకీయ బుకీలు రంగంలోకి దిగారు.

తమ అనుచరుల ద్వారా పెద్ద ఎత్తున పందేలు నిర్వహించే పనిలో ఉన్నారు. పలువురితో సంప్రదింపులు జరుపుతూ పెద్ద ఎత్తున పందేలు కడుతున్నట్లు తెలిసింది. తెలంగాణ ఎన్నికలపై ఏపీలో ఇప్పటికే రూ.200 కోట్ల వరకు పందేల రూపంలో సొమ్ము చేతులు మారినట్లు చెపుతున్నారు. ఎన్నికల నాటికి ఇది ఎంత వరకు వెళుతుందనేది రోజు రోజుకూ చోటు చేసుకునే పరిణామాలను బట్టి ఉంటుంది.

ప్రపంచ కప్‌ -23 ఆదివారంతో ముగుస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఫైనల్స్‌కు భారత్‌ చేరింది. భారత్‌పై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తిస్తుండటంతో క్రికెట్‌ బుకీల పంట పండిందనే చెప్పొచ్చు. మూడు రోజుల్లో ప్రపంచ కప్‌ ముగుస్తుండటంతో తెలంగాణ ఎన్నికలను వేదికగా చేసుకొని సొమ్ము చేసుకునే వ్యూహంతో రాజకీయ బుకీలు ఉన్నారు. ఇప్పటికే కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున పందెం కాసేవాళ్లతో బుకీల అనుచరులు సంప్రదింపులు జరుపుతున్నారు.

- Advertisement -

ప్రతి ఏటా సంక్రాంతికి కోస్తా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు జరుగుతుంటాయి. వీటిని సొమ్ము చేసుకునేందుకు హైదరాబాద్‌, ముంబై తదితర ప్రాంతాల నుంచి బుకీలు ముందుగానే వచ్చి ఇక్కడ మకాం చేస్తుంటారు. ఈ మధ్యలో వచ్చిన తెలంగాణ ఎన్నికలు వారికి వరంగా మారిందని చెప్పొచ్చు. ప్రపంచ కప్‌ పోటీలు ముగిసిన మరుసటి రోజు నుంచే తెలంగాణ ఎన్నికలపై పెద్ద ఎత్తున పందేలు కట్టేందుకు పలువురిని సిద్ధం చేస్తున్నారు.

బంపర్‌ ఆఫర్లు..

తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వంపై ఏపీలో నెలకొన్న ఆసక్తిని బట్టి బుకీలు పలు ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. కోసు పందేల జోరు కూడా పెరిగింది. అధికారంలోకి వచ్చే పార్టీపైనే కాకుండా..జిల్లాల్లో మెజారిటీ సీట్లు ఎవరికి వస్తాయి? ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖుల గెలుపోటములపై కూడా జోరుగా పందేలు సాగుతున్నాయి. పందేలు కట్టే వారి ఆలోచనలను బట్టి గెలిస్తే ఒకటికి..ఒకటిన్నర ఇస్తామంటూ పందెం రాయుళ్లను ప్రలోభపెడుతున్నారు.

కర్నాటక ఎన్నికల ఫలితాల నేపధ్యంలో కాంగ్రెస్‌పై అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో బీఆర్‌ ఎస్‌ శక్తిని కూడా తక్కువ అంచనా వేయలేమని పలువురు చెపుతున్నారు. గతంలో ముక్కోణపు పోటీ ఉంటుందని భావించినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కొంత వెనుకబడింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య నువ్వా? నేనా? అనే రీతిలో పోరుసాగుతోంది. ఏ మాత్రం పోల్‌ మేనేజ్‌మెంట్‌లో తేడా వచ్చిన ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పందేలు సాగుతున్నాయి.

క్షేత్రస్థాయిలో ఆరా..

ఉత్కంఠత రేకెత్తిస్తున్న తెలంగాణ ఎన్నికలపై పందేలు కట్టేవారు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాల వారీగా మనుషులను పంపి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. తెలంగాణలోని తమ స్నేహితులు, బంధువులు, పరిచయస్తులతో టచ్‌లో ఉంటూ ఎన్నికల సరళిపై వాకబ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే పెందేలు కట్టేందుకు సిద్ధమైన వారు సరిహద్దు జిల్లాలకు వెళ్లి పరిశీలించి వస్తున్నారు. కొందరు ఆయా జిల్లాల్లో ఒకట్రెండ్‌ రోజులు బస చేసి ప్రజల నాడీని బట్టి ఒక అంచనాకు వస్తున్నారు.

కీలకంగా జ్యోతిష్కులు..
తెలంగాణ ఎన్నికల్లో పందెం కాసేవాళ్లకు జ్యోతిష్కులు కూడా కీలకంగా మారారు. పందెం రాయుళ్ల సంప్రదింపుల నేపధ్యంలో వీరికి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల భవిష్యత్‌పై జ్యోతిష్కుల ద్వారా తెలుసుకుంటున్నారు. పార్టీలకు నేతృత్వం వహించే వారి భవిష్యత్‌పై ఆయా పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయనే నమ్మకం పందెం రాయుళ్లలో నెలకొంది. మరికొందరు తాము పందెం కాసే అభ్యర్థి జాతకాలు కూడా చూపించడం ద్వారా గెలుపోటముల పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జ్యోతిష్కులు ఇచ్చే సమాచారం, క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసుకొని పందేలు కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో చలికాలంలో సైతం వేడెక్కిస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3న వెలువడనున్నాయి. అప్పటి వరకు పందేల జోరు సాగుతూనే ఉంటుందని తెలుస్తోంది. మరి పందెం రాయుళ్ల భవిష్యత్‌ ఎలా ఉండబోతోందనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement