దర్శి నగర పంచాయతీ ఎన్నికల చివరి అంకానికి రంగం సిద్దమైంది. సోమవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ నేడు జరనుంది. స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉన్న ఓటరు తీర్పు ఫలిలాలు వెలవడనున్నాయి. ఈ ఫలితాల పై జిల్లాలో జోరుగా పందేలు కాస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు మండల స్థాయి నేతలు కూడా బెట్టింగ్ వేస్తున్నారు. దర్శి పట్టణంలోని మొత్తం 19 వార్డుల్లో ప్రస్తుతం గెలుపు ఎవరిదనే మాటే అందరి నోటా వినిపిస్తోంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్ధుల జాతకాలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల కోసం నేడు అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దర్శిలోనూ ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎవరికి వారు గెలుపోటముల పై తమ అంచనాలతో జోరుగా విశ్లేషిస్తున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్ధులు టెన్షన్ పడుతుంటే..మరో వైపు ఫలితాల పై జోరుగా పందేలు కొనసాగుతున్నాయి.
ప్రభన్యూస్ బ్యూరో, ఒంగోలు: దర్శిలో ఎవరు గెలుస్తారు..? ఎవరికి ఎన్ని వార్డులు వస్తాయి..?మెజార్టీల పరిస్థితి ఏమిటి..? అనే అంశాల పై దర్శిలో జోరుగా పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరస్పర బెట్టింగ్ కాస్తున్నారు. రూ. 5వేల నుంచి రూ. లక్షల వరకు తమ స్థాయికి తగ్గట్టుగా బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. మరి కొందరు విందులు, వినోదాలు ఇచ్చేలా పందెం కాస్తున్నారు. తాము పెట్టిన సొమ్ముకు రెట్టింపుగా రాబట్టుకునేందుకు పందెం రాయుళ్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంతో పాటు, దర్శిలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో బెట్గిం గ్ రాయుళ్లు పందెం కాసేందుకు అవకాశం కల్పిస్తోంది. దర్శి నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ సభలు పెట్టి మరీ ప్రచారం చేయడం, ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం ప్రచారం చేయడంతో దర్శిలో గెలుపు ఎవరిదనేఊ అంశం పై బెట్టింగ్‌లు కాస్తున్నారు. అంచనాలు, సర్వేలు, విశ్లేషనలు, సోషల్‌మీడియా పోస్టింగ్‌లను బేస్ చేసుకొని బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం.
దర్శి నగర పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా కాకరేపుతుండటంతో..ఫలితాల పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో దర్శితో పాటు, జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ కూడా సాగుతోంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ సరళిని బట్టి ఓ అంచనాకు వస్తున్న రాజకీయ నాయకులు కూడా ఈ సారి ఎక్కువగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేది జరిగిన పోలింగ్‌లో దర్శి పట్టణంలో 76.40 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే, పోలింగ్ రోజు పలు వార్డులో అనేక వ్యవహాలు జరిగినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. బయటి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని చెబుతున్నారు. ఇదే సమయంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నేతలు పట్టుకున్న సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
దీంతో నేడు జరిగే కౌంటింగ్‌లో ఎన్నికల ఫలితాల పై ఆసక్తికరమైన అంచనాలు వేస్తున్నారు. అంతే కాదు దర్శిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. ఆయా వార్డుల్లో చోటు చేసుకున్న వ్యవహారాల పై రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలస్తోంది. మొత్తం 20 వార్డులకు గాను, 8వ వార్డు వైసీపీ ఏక గ్రీవంగా గెలుచుకోగా, 19 వార్డులకు పోటీ జరిగింది. ఈ వార్డుల్లో ప్రతి వార్డులో కూడా అభ్యర్ధుల గెలుపు కోసం రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. అధికార పార్టీ ఎత్తుగడలకు ప్రతిపక్ష పార్టీ కూడా ఎక్కడ తగ్గని పరిస్థితి కనిపించింది. ఒక వైపు రాష్ట్ర మంత్రులు వచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేసిన సమయంలోనే.. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు దర్శిలోనే మకాం వేసి సమాలోచనలు చేశారు. ప్రచారంలోనూ సర్వశక్తులు ఒడ్డారు. దీంతో దర్శిలో ఫలితాల పై ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరికి వారు అంచనాలు వేసుకోవడం తప్ప, స్పష్టమైన మెజార్టీల విషయాన్ని చెప్పలేక పోతున్నారు.
ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి…
ఈనెల 17వ తేదిన (నేడు) ఓట్ల లెక్కింపు ప్రక్రియ దర్శి మోడల్ స్కూల్లో జరుగుతుంది. ఎన్నికలు ముగియగానే రిసెప్షన్ సెంటర్‌కు బ్యాలెట్ బాక్స్‌లు తరలించారు. అక్కడ పరిశీలించిన అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లో వాటిని భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు కోసం 5 హాల్స్‌ను సిద్ధం చేశారు. మొత్తం 38 టేబుల్స్ వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకోసం ఐదుగురు ఎన్నికల అధికారులు, 10 మంది సహాయ ఎన్నికల అధికారులు, మరో 10 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, మరో 99 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపుకు నియమించారు.