Thursday, November 7, 2024

ఏపీ సీడ్స్‌ ద్వారా 20 లక్షల మంది రైతులకు లబ్ధి.. మిరప, పత్తి విత్తనాలకు 20 కంపెనీలతో ఎంఓయూ

రాయలసీమ, ప్రభన్యూస్‌ ప్రతినిధి : ఏపీ సీడ్స్‌ ద్వారా రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని, ఈ ఏడాది నాణ్యమైన 230 కోట్ల రూపాయల రాయితీ విత్తనాల సరఫరాకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఏపి సీడ్స్‌ ఎండి డాక్టర్‌ శేఖర్‌బాబు అన్నారు. రాయలసీమ జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీపై ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపి సీడ్స్‌ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను కర్నూలు జిల్లా ఏపి సీడ్స్‌ మేనేజర్‌ శ్రీనివాసరావుతో కలిసి ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్రంలో ఖరీఫ్‌, రభీ సీజన్‌కు 6,50,000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను సిద్ధం చేశామని, అందులో అత్యంత ప్రాధాన్యతగా 3,50,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా 40 శాతం రాయితీతో పంపిణీ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఈ వేరుశనగ విత్తనాలతో పాటు కందులు, మినుములు, పెసలు, వీలుగా పిల్లిపెసర తదితర విత్తనాలను కూడా సరఫరా చేస్తున్నామన్నారు. వేరుశనగ విత్తనాల సేకరణ, ప్రాసెసింగ్‌ ప్రక్రియ పూర్తిచేసి నాణ్యత పరీక్ష అనంతరమే అన్నదాతలకు సరఫరా చేస్తున్నామన్నారు.

ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుండి మిరప, పత్తి విత్తనాల నాన్‌ సబ్సిడీ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 20 కంపెనీలతో ఎంఓయు పూర్తి చేశామని, ప్రారంభానికి వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఏపి సీడ్స్‌ ద్వారా రాష్ట్రంలో 25 గోదాముల్లో విత్తనాలను శుద్ధిచేసి రాయితీ ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్‌ఎఫ్‌ఎం స్కీము ద్వారా విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం మూడు జిల్లాల్లో వరి విత్తనాలను సరఫరా చేస్తున్నామన్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తనాలు పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఏపి సీడ్స్‌లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 50 శాతం మంది పొరుగు సేవల కింద ఉన్నారన్నారు. చిరు ధాన్యాల విత్తనాలను కూడా రాయితీ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఏపి సీడ్స్‌ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ ఖరీఫ్‌, రభీ సీజన్‌లో నాణ్యమైన విత్తనాల సరఫరాకు వ్యవసాయ యంత్రాంగంతో కలలసి అన్నదాతల గుమ్మం వద్దకే చేరవేయడం జరుగుతుందన్నారు.

ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుండే ఏపి సీడ్స్‌ ద్వారా మిరప, పత్తి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో అత్యంత ప్రాముఖ్యతంగా నాణ్యమైన విత్తనాలు ప్రామాణికను తీసుకుని ముందుకు వెళ్తామని సూచించారు. అంతకు ముందు కర్నూలు జిల్లాలో ఏపి సీడ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రక్రియను పరిశీలించి వేరుశనగ నాణ్యతను పరిశీలించారు. వీరివెంట జిల్లా వ్యవసాయ అధికారిణి పి లలితా వరలక్ష్మి, ఏడిలు సాలురెడ్డి, వ్యవసాయ, ఏపి సీడ్స్‌ యంత్రాంగం పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement