Tuesday, November 26, 2024

బీఈడీ కౌన్సెలింగ్‌ గడువు 31 వరకు పొడిగింపు..

అమరావతి, ఆంధ్రప్రభ: బీఈడీ కౌన్సెలింగ్‌ గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించాలని హైకోర్టు ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఈనెల 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌కు ఆదేశాలు జారీచేయాలని తమ సంస్థలను కూడా కౌన్సెలింగ్‌కు అనుమతించాలని పలుు ప్రైవేట్‌ బీఈడీ విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. అదే సమయంలో కౌన్సెలింగ్‌ గడువును పొడిగించాల్సిందిగా పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కే మన్మథరావు వి చారణ జరిపారు. పిటిషనర్ల తరుపున సీనియర్‌ న్యాయవాదులు ఎ సత్యప్రసాద్‌, మతుకుమిల్లి విజయ్‌ వాదనలు వినిపించారు. జీరో అడ్మిన్‌ పేరుతో కొన్ని కళాశాలలను కౌన్సెలింగ్‌ నుంచి ఏకపక్షంగా తప్పించారని కోర్టు దృష్టికి తెచ్చారు.

- Advertisement -

ఈ విషయం 24వ తేదీనే ప్రకటించారని 25 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమైందని వివరించారు. ఉన్నత విద్యామండలి తరుపున సహాయ న్యాయవాది జోక్యం చేసుకుంటూ అనుమతించని కళాశాలల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిబంధనలకు అనుగుణంగానే ఆయా కళాశాలలను జాబితా నుంచి తొలగించామని వివరణ ఇచ్చారు. ఈ కళాశాలల్లో చేరితే విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి తొలివిడత కౌన్సెలింగ్‌ గడువును ఈనెల 31వతేదీకి పొడిగించాలని జాబితా నుంచి తొలగించిన కోర్టును ఆశ్రయించిన కళాశాలలను కూడా కౌన్సెలింగ్‌కు అనుమతించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement