వజ్రపుకొత్తూరు, మార్చి 23 (ప్రభన్యూస్) : ఉద్దానంలో ఎలుగుబంట్ల అలజడి సృష్టిస్తున్నాయి. ఎలుగుబంట్ల దాడితో ఉద్దానం జీడి రైతుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. శనివారం మండలంలోని చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో పిల్లల ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడి తోటల్లో పనులు చేసుకుంటున్న వారిపై దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందారు.
వారిలో అప్పికొండ కూర్మారావు (47), చీడిపల్లి లోకనాధం (48) లకు బుగ్గలు, కాలు, వీపుపై తీవ్ర గాయాలు చేసి మాంసం ముక్కలు బయటకు వచ్చేలా తీవ్ర గాయాలు చేసింది. గాయాలతో తీవ్ర రక్తస్రావం జరిగి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతుడు లోకనాధం భార్య సావిత్రి పై దాడి చేసింది. ఆమె కు తీవ్ర గాయాలు కావడంతో కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతుంది. జీడి తోటల ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. పరిసర గ్రామాలకు ఈ విషయం దావానంలా వ్యాపించడంతో తోటలు వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. జనాలు అలజడితో ఎలుగుబంట్లు ఆ స్థలం నుండి దౌడు తీసాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సావిత్రి ని చికిత్స నిమిత్తం స్థానికులు పలాస ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. సంఘటన స్థలంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎలుగుబంట్ల సంచారంపై దృష్టి సారించాలని అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా చర్యలు లేవని ఆ శాఖ పనితీరు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.