Saturday, November 2, 2024

పోర్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు బీచ్ హైవే.. కేంద్రాన్ని కోరిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్..

విశాఖపట్నం పోర్ట్ నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు 6-వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు ఆయన తొలుత కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఉదయం గం. 9.30 నుంచి దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో విశాఖ పోర్టు నుంచి కొత్తగా నిర్మించే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ వరకు బీచ్ హైవే నిర్మాణం గురించి ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు విశాఖ నగరానికి చాలా ఉపయోగకరమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు సైతం ప్రయాణ దూరం తగ్గుతుందని తెలిపారు.

సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న బీచ్‌కారిడర్‌ ప్రాజెక్టులకు సమీపం నుంచే ఈ రహదారి వెళ్తుందని, తద్వారా పారిశ్రామికాభివృద్ధికి సైతం దోహదపడుతుందని చెప్పారు. విశాఖ నగరవాసులు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, అలాగే తీరంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత ఉపయోగకరమని సీఎం జగన్ కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ నగరంలో వాహనాల రద్దీతోపాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 6 లేన్ల రహదారిని మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను కేంద్ర మంత్రికి అందజేసినట్టు తెలిసింది.

దీంతో పాటు విజయవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తి గుర్తుచేస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని సీఎం జగన్, కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులు కూడా ఇస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని కోరారు. మరోవైపు కత్తిపూడి – ఒంగోలు కారిడర్‌లో భాగంగా జరుగుతున్న ఎన్‌హెచ్‌-216 నిర్మాణంలో బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని సీఎం కోరారు. విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్‌ కారణంగా ట్రాఫిక్‌ రద్దీ పెరిగే అవకాశం ఉందని, బాపట్ల మీదుగా వెళ్తున్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తే ఆ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి అడిగిన ప్రాజెక్టులను మంజూరు చేసిన కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం జగన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement