న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పదోన్నతుల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్ వద్ద భారీ ప్రదర్శన చేపట్టింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు, సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేవని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం, బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబించడం మూలంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టలేదని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన మండల్ కమిషన్ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని సిఫార్సు చేసిందని ఆర్. కృష్ణయ్య గుర్తుచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఉత్తర్ ప్రదేశ్ కేసు విచారణ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల సంఖ్య రిజర్వేషన్లకు అనుగుణంగా లేకపోతే పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు అమలుపర్చాలని తీర్పునిచ్చిందని అన్నారు.
అన్నివైపుల నుంచి బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని సిఫార్సులు, సూచనలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర స్థాయి ఉద్యోగాలు మొత్తం 54 లక్షలు ఉంటే, బీసీ ఉద్యోగులు కేవలం 4.62 లక్షలు మాత్రమే ఉన్నారని, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లు, బ్యాంకింగ్, రక్షణ రంగం నుంచి మొదలుకొని రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాల వరకు బీసీలకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ ఉద్యోగులు అటెండర్లు, వాచ్మెన్లుగానే మిగిలిపోతూ, గెజిటెడ్ అధికారి కాకుండానే పదవీ విరమణ చేస్తున్నారని తెలిపారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలలో 27% బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తరువాత కూడా బీసీ ఉద్యోగుల సంఖ్య 12.శాతం దాటకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్లనే ఇంత అన్యాయం జరుగుతోందని సూత్రీకరించారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖలు, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపి మొత్తం 16 లక్షలు ఖాళీలున్నాయని, ఒక్క రైల్వే శాఖలోనే 3.53 లక్షల ఉద్యోగాలు, బ్యాంకింగ్ రంగంలో 1.30 లక్షల ఉద్యోగాలు, రక్షణ రంగ సంస్థలలో 4.3 లక్షల ఉద్యోగాల ఖాళీలున్నాయని తెలిపారు. వీటిని భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరారు. ఈ భారీ ప్రదర్శనకు ఆర్. కృష్ణయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ నేతృత్వం వహించారు.