న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జనాభా లెక్కల సేకరణలో వెనుకబడిన కులాల గణన కూడా చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. వెనుకబడిన కులాల సంక్షేమ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా రూపకల్పన చేయడానికి బీసీ కులాల వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన అన్నారు. 1872 నుంచి 1931 వరకు దాదాపు ఆరు దశాబ్దాలపాటు దేశంలో నిర్వహించిన జనాభా లెక్కల సేకరణలో వెనుకబడిన కులాల ఆర్థిక, సామాజిక లెక్కలు కూడా భాగంగా ఉండేవని అన్నారు. స్వాతంత్రం అనంతరం నిర్వహించిన చేపట్టిన జనాభా లెక్కల సేకరణలో ఎస్సీ, ఎస్టీ కులాలకు తప్ప వెనుకబడిన కులాల లెక్కల సేకరణ జరపలేదు.
దేశంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కిందకు రాని వెనుకబడిన కులాల జనాభా భారీ సంఖ్యలో ఉంది. కానీ వారికి సంబంధించిన కచ్చితమైన వివరాలేవీ అందుబాటులో లేవు. ఫలితంగా అనేక మంది అనర్హులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో బీసీ రిజర్వేషన్ కింద ప్రయోజనాలు పొందుతున్నారు. దీనివల్ల బీసీల్లో అర్హులైన నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. సాధారణ జనాభా లెక్కల సేకరణలో ఎస్సీ, ఎస్టీల లెక్కలను కూడా చేర్చారు. 2021లో చేపట్టవలసిన జనాభా లెక్కల సేరణలో అదనంగా బీసీల లెక్కల సేకరణను కూడా చేర్చడం అసాధ్యం, ఆచరణసాధ్యం ఏమీ కాదు. జనాభా లెక్కల సేకరణలోనే బీసీ కులాల సామాజిక, ఆర్ధిక వెనుకబాటుతనాన్ని తెలిపే కుల గణనను చేర్చడం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కూడా కాదు.
బీసీ కులాల గణనను చేపట్టడం వలన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం విద్యా సంస్థలు, ప్రభుత్వరంగంలో వెనుకబడిన కులాలకు కల్పించిన రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే సౌలభ్యం కలుగుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. జనాభా లెక్కల సేకరణతోపాటు బీసీ కులాల గణనను కూడా చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిందని ఆయన చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల గణనను చేపడితే అందుకు అవసరమైన మానవనరులను సమకూర్చడంతోపాటు అన్ని విధాలా సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ వలన కలుగుతున్న ప్రయోజనాలు దాని ఫలితాల గురించి విస్పష్టమైన అవగాహన రావాలంటే జనాభా లెక్కల సేకరణతోపాటు బీసీ కులాల గణనను చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు.
43 కోట్లతో శ్రీశైలం దేవాలయం అభివృద్ధి
శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి కోసం 43 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గురువారం రాజ్యసభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ప్రసాద్ పథకం కింద శ్రీశైలం దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సెప్టెంబర్ 13, 2017లో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆమోదిస్తూ 47 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. దేవస్థానం అభివృద్ధి పనులను 2021లో 43 కోట్ల రూపాయలతో పూర్తి చేసినట్లు తెలిపారు.