విజయవాడ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున బస్టాండ్‌లో పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు గంటపాటు బ్లేడ్ బ్యాచ్‌తో జరిగిన ఘర్షణ లో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు భయాందోళలనకు గురయ్యారు.
రాత్రివేళలో విజయవాడ బస్టాండ్లోని బెంచీలను బ్లేడ్ బ్యాచ్ ఆక్రమించుకుంటుంది. యాచకులు కూడా తాగొచ్చి బస్టాండ్లోనే ఉంటున్నారు. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. వారిని బస్టాండ్ నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ప్రయత్నించారు.
ఈ క్రమంలో రెచ్చిపోయిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్ సిబ్బందిపైనే బ్లేడ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఆర్టీసీ ఉద్యోగి సాంబయ్య, ఆర్టీసీ ట్రాఫిక్ ఎస్సై వై.శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి.
దీంతో అదనపు పోలీసు బలగాలను రప్పించడంతో భయపడిపోయిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్ అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.