Friday, November 22, 2024

Exclusive – ఎక్సైజ్‌ శాఖ మాయాజాలం – బార్లు గ‌ల గ‌ల …వైన్ షాపులు వెల‌వెల

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుండే ఎ క్సైజ్‌ శాఖ ఇటీవల కాలంలో తీసుకుంటున్న కొన్ని వింత నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పడుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలను పెంచి ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని అందించాల్సిన ఆ శాఖలోని కొంత మంది అధికారులు ప్రైవేట్‌ మద్యం వ్యాపారుల్ని ప్రొత్సహిస్తున్నారు. ఫలితంగా నిత్యం కోట్లాది రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తోంది. కొంతమంది అధికారులు బార్ల యజమానులతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటు న్నారు. గతంలో ప్రభుత్వం సూచించిన సమయానికంటే ముందు గానే మద్యం దుకాణాలను మూసి వేయించేస్తున్నారు. ఫలితంగా ఆయా దుకాణాల పరిధిలోని బార్ల యజమానులకు పరోక్షంగా లబ్ధి చేకూరుస్తున్నారు. కొన్ని జిల్లాల్లో గంట ముందే మద్యం దుకాణాలను మూసి వేయాలని సిబ్బందికి అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని బార్ల యజమానులు ప్రతి నెలా ఎ క్సైజ్‌ అధికారులతో పాటు దుకాణాల సిబ్బందికి కూడా పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టజెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల పరిధిలో ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్‌ మద్యం దుకాణాలను తొలగించి ఆ స్థానంలో ప్రభుత్వమే వైన్‌ షాపులను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. అయితే గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 876 బార్లకు అనుమతిలిచ్చింది. ఆయా ప్రాంతాన్ని బట్టి బార్‌ లైసెన్స్‌ ధరను నిర్ణయించింది. అంతకుముందే 2 వేల 934 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు పర్యాటక ప్రాంతాలు, వాక్‌-ఇన్‌-స్టోర్స్‌ రూపంలో మరో 700 షాపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఒక్క బార్లను మాత్రమే ప్రైవేట్‌ వ్యాపారులు నిర్వహిస్తున్నారు. మిగిలిన దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాల్లో అమ్మకాలను పెంచి ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయాన్ని అందించాల్సిన ఎ క్సైజ్‌ శాఖ బార్ల యజమానులతో చేతులు కలిపి అక్కడ అమ్మకాలు పెరిగేలా చేస్తున్నారు. అందుకోసం నిబంధనలను సైతం తుంగలో తొక్కి 24 గంటలు కొన్ని బార్లలో అమ్ముకునేలా పరోక్షంగా సహకారాన్ని అందిస్తున్నారు. ఫలితంగా మందుబాబులు నిలువునా నష్టపోవాల్సి వస్తోంది.

గంట ముందుగా.. వైన్‌ షాపులు బంద్‌..
ఎ క్సైజ్‌ శాఖ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం విక్రయాలు చేపట్టాలి. అయితే బార్ల యజమానులతో చేతులు కలుపుతున్న కొంతమంది అధికారులు కొన్ని జిల్లాల్లో గంట ముందే అంటే రాత్రి 8 గంటల లోపే దుకాణాలను మూసి వేయిస్తున్నారు. వాస్తవానికి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు మద్యం విక్రయాలు ఎక్కువగా సాగుతుంటాయి. అయితే ఆ సమయాల్లోనే దుకాణాలు మూసి వేసేలా కొంతమంది అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన బార్లు 7 గంటలకే అమ్మకాలను ప్రారంభిస్తున్నా అధికారులు అటువైపుకు కూడా కన్నెత్తి చూడకపోవడం బార్లపై కనీసం చర్యలు కూడా తీసుకోకపోవడం బట్టి చూస్తుంటే పై ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.

బార్లు వెనకే.. ప్రభుత్వ మద్యం అమ్మకాలు..
రాష్ట్రంలో బార్లుకు అనుమతిలిచ్చాక మద్యం దుకాణాల్లో అమ్మకాలు తగ్గడంతో పాటు ప్రభుత్వ దుకాణాల్లోని మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా బార్ల వెనుక ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. అదికూడా ప్రభుత్వ దుకాణాలు మూసి వేసిన తర్వాత విక్రయాలని చేపడుతున్నారు. దీంతో కొంతమంది దినసరి కూలీలు, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులు క్వార్టర్‌ బాటిల్‌పై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ. 50 నుంచి రూ. 80 అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు తిరుపతి జిల్లాలోని నాయుడు పేట పట్టణ పరిధిలో ఓ బార్‌ కోసం అధికారులు ఏకంగా రెండు ప్రభుత్వ దుకాణాలనే తొలగించేశారు. అవే బార్లలో వెనుక వైపు ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ దుకాణాల్లోని మద్యాన్ని అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆ జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులకు పెద్ద ఎత్తున మాముళ్లు ముట్టుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బార్లలో 24 గంటలు అమ్మకాలు..
ప్రభుత్వ మద్యం దుకాణాలన్నీ నిర్ణీత సమయం కంటే గంట ముందే మూయించేస్తున్న అధికారులు ప్రైవేట్‌ బార్లలో 24 గంటలు మద్యం అమ్మకాలు చేపడుతూ మందు బాబులను దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదు. నిబంధనల మేరకు బార్లలో మద్యం అమ్మకాలు జరిగేలా చూడాల్సిన అధికారులు లక్షల్లో మామూళ్లు తీసుకుంటూ కోట్లలో ప్రభుత్వ రాబడికి గండి కొడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మద్యం దుకాణంలోని సిబ్బందితో జిల్లా స్థాయి అధికారులు చేతులు కలిపి కొన్ని మద్యం కేసులని మందుబాబులకు విక్రయించినట్లుగా చూపిస్తూ ఆ మద్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులకు ఇచ్చేస్తున్నారు. దీంతో మందు బాబులు దోపీడీకి గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నా ఉన్నతాధికారులకు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు సందేహాలకు తావిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి అధికారులు బార్లపై నిఘా పెట్టడంతో పాటు ముందే మూసి వేస్తున్న ప్రభుత్వ దుకాణాల్లో నిబంధనల మేరకు మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement