అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ లైసెన్స్‌ల మంజూరుకు విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 840 బార్లకు మూడేళ్ల కాలానికి లైసెన్స్‌లు మంజూరు చేయనున్నారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి 11గంటల వరకు బార్లలోను, స్టార్ హోటల్స్‌లో అర్థరాత్రి 12గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతివ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నగర పంచాయితీలు, పట్టణాలు, మున్సిపల్ కార్పోరేషన్ల వారీగా బార్ల జాబితాను ప్రకటిస్తూ మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. బార్లలో దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్), సుంకం చెల్లించిన విదేశీ మద్యం రవాణా, అమ్మకాలకు లైసెన్స్‌దారులకు అనుమతిస్తారు. 50వేల జనాభా లోపున్న ప్రాంతాల్లో దేశీయంగా తయారైన విదేశీమద్యం, విదేశీ మద్యం రవాణాకు లైసెన్సుదారునికి అవకాశం ఇస్తూ నిబంధనలు ఖరారు చేశారు. 50 వేలు జనాభా ఉన్న ప్రాంతాల్లో వార్షిక లైసెన్స్ ఫీజుగా రూ. ఐదు లక్షలు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీగా రూ. 15లక్షల, 50వేలు పైబడి, ఐదు లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజుగా రూ. ఐదు లక్షలు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీగా రూ. 35లక్షలు, ఐదు లక్షల జనాభా పైబడి ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.ఐదు లక్షలు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 50లక్షలుగా నిర్ణయించారు.
నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలను ఏటా 10శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బార్ల ఏర్పాటు చేసే ప్రాంతాలను అధికారులు తనిఖీ చేసి నిర్థారించనున్నారు. బార్ లైసెన్స్‌లు ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారానే మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ తెలిపారు. అత్యధికంగా కోట్ చేసిన వారిని హెచ్1గా ఎంపిక చేస్తారు. అదే ప్రాంతంలో ఇతర బార్లకు సంబంధించి 10శాతం తగ్గింపుతో ఈ-బిడ్డింగ్ నిర్వహించి లైసెన్స్‌లు మంజూరు చేయనున్నారు. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి రోజును డ్రైడేగా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎక్సైజు, నార్కోటిక్స్ కేసుల్లో శిక్ష పడిన వారు, ఎక్సైజు శాఖకు బకాయిలు పడిన వారికి లైసెన్స్‌లు మంజూరు చేయరు. ఇదే సమయంలో బినామీలకు అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ బార్లకు లైసెన్స్ తీసుకోదలచుకున్న వారు విడివిడిగా దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. రానున్న రెండు మూడు రోజుల్లో కొత్త జిల్లాల సర్దుబాట్ల ఆధారంగా బార్ల సంఖ్యను గుర్తించి ఈ-బిడ్డింగ్ తేదీలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.