ఆంధ్రప్రభ స్మార్ట్, బాపట్ల బ్యూరో – దేశ సరిహద్దులో అహర్నిశం పహారా కాస్తూ… త్వరలోనే ఉద్యోగ విరమణతో బాపట్లలో ఇల్లు కట్టుకుని హాయిగా తన జీవితాన్ని గడుపుతానని కుటుంబ సభ్యులు.. స్నేహితులతో చెప్పి వెళ్లిన ఆర్మీ జవాన్ షేక్ రజ్జు భాష అకస్మికంగా గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు చేరుకోవటం భావపురి గొల్లుమంది. కన్నీరు మున్నీరైంది,. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి, బాపట్ల పట్టణం బావ పూరి కాలనీకి చెందిన షేక్ రజ్జు బాషా ( 42 ) జమ్ము కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ బుధవారం రాత్రి 11 గంటల సమయంలో వాష్ రూమ్ కి వెళ్లి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు గుర్తించి హాస్పటల్ కు తీసుకువెళ్లిన అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు.
నిరుపేద బిడ్డ… రజ్జు బాషా
బాపట్ల పట్టణం బావ పూరి కాలనీకి చెందిన రాజ్జు భాషా తండ్రి ఖాజావలి హోటల్లో సర్వర్ గా పని చేస్తాడు . తల్లి దరియాభి ఇళ్ళవద్ద ఇడ్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తారు. అతి నిరుపేద కుటుంబం నుండి వచ్చిన రాజ్జు భాష ఆర్మీలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. గత 22 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు . ఈ ఏడాది చివరినాటికి పదవీ విరమణ చేసి బాపట్ల లో గృహాన్ని నిర్మించుకొని జాలీగా గడుపుతానంటూ ఇటీవల సెలవు పై ఇంటికి వచ్చి వెళుతూ బంధువులతో స్నేహితులతో చెప్పాడు. సరదాగా ఉద్యోగ నిర్వహణకు వెళ్లిన రజ్జు భాష మృతి చెందాడని వార్తను ఈ ప్రాంత వాసులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
జమ్మూ కాశ్మీర్లో జూనియర్ కలెక్షన్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్జు భాషా మృతి సమాచారాన్ని ఆర్మీ అధికారులు గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బాపట్ల తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు . రజ్జు భాష మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు జరిగిన సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుండి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని అన్నారు.