చిత్ర హింసలు పెట్టి అత్యాచారం..
ఆపై దారుణంగా హత్య
రైలు ట్రాక్ సమీపంలో మృతదేహం
నెల్లూరు వాసి సుచరితగా గుర్తింపు
సచరిత హత్యపై చంద్రబాబు సీరియస్..
ఈపూరుపాలెం వెళ్లవలసిందిగా హోం మంత్రికి ఆదేశం
ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని డిజిపికి హుకుం
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత హత్యకు గురైంది. ఈపూరుపాలెంలోని రైల్వే పట్టాల సమీపంలో యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు. డెడ్ బాడీని చూసిన స్థానికులు ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఒంటి పైన కొట్టిన దెబ్బలు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. బాధిత యువతి నెల్లూరు జిల్లా వాసి సుచరిత గా గుర్తించారు. ..
స్పందించిన చంద్రబాబు…
సుచరిత హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తులో అలసత్వం లేకుండా.. జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపురుపాలెంకు హోంమంత్రి అనిత బయలుదేరారు.
ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబును డీజీపీ ద్వారకా తిరుమల రావు కలిశారు. చీరాల మండలం ఈపూరు పాలెంలో మహిళ హత్యోందతాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.