జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకి నిరసనగా టీడీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ కు పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఉదయం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు బంద్ లో పాల్గొన్నాయి. శాంతి యుతంగా నిరసన తెలియచేస్తున్న జనసేన నాయకులను పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుని, అరెస్టులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి పలువురు జనసేన నాయకుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు కూడా కొనసాగాయి. 144 సెక్షన్, సెక్షన్ 30అమల్లో ఉందంటూ ఎక్కడికక్కడ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.
గుంటూరు జిల్లా :
గుంటూరు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ తో పాటు పార్టీ నాయకులందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకుల అరెస్టుల అనంతరం గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. స్వచ్చందంగా బంద్ పాటిస్తున్న దుకాణదారుల వద్దకు వెళ్లి బలవంతంగా తెరిపించడం మొదలుపెట్టారు. అది చూసి జనసేన నాయకులు వైసీపీ శ్రేణుల్ని ప్రతిఘటించే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. అధికార పార్టీ శ్రేణులకు 144 సెక్షన్ వర్తించదా అంటూ జనసేన నాయకులు పోలీసుల్ని నిలదీశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి శాంతియుత నిరసనల్ని అణచివేసే ప్రయత్నం చేశారు.
మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలసి నిరసనకు దిగిన జనసేన ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి విజయ్ శేఖర్ సహా పలువురిని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. తెనాలి, రేపల్లి, నరసాపురం తదితర నియోజకవర్గాల్లోనూ శాంతియుత నిరసనల అణచివేతలు, జనసేన నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగాయి. తెనాలిలో నిరసన ర్యాలీ చేపట్టిన జనసేన నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
కృష్ణా జిల్లా :
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు టీడీపీ నాయకులతో కలసి శాంతియుతంగా బంద్ లో పాల్గొన్నాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలతో పాటు జనసేన నాయకుల్ని పోలీసులు అరెస్టులు చేశారు. విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులతో కలసి నిరసనలో పాల్గొన్న రావి సౌజన్యను అరెస్ట్ చేశారు. గుడివాడలో నిరసన కార్యక్రమం చేపట్టిన శ్రేణులపై పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. పామర్రులో తాడిశెట్టి నరేష్ తో పార్టీ మండల నాయకుల్ని ఉదయమే అరెస్టు చేసి స్టేషన్ లో నిర్బంధించారు. మైలవరం గుడివాడలో బూరగడ్డ శ్రీకాంత్ శాంతియుతంగా నిరసన చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం, అవనిగడ్డ, తిరువూరు, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతల అరెస్టులు కొనసాగాయి.
తూర్పు గోదావరి జిల్లా :
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని ఉదయమే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మండపేట ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, అమలాపురం ఇంఛార్జ్ రాజబాబు, రామచంద్రపురం ఇంఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్ తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, రాజోలులో బొంతు రాజేశ్వరరావులు టీడీపీ శ్రేణులతో కలసి శాంతియుతంగా బంద్ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజక వర్గం పరిధిలో, రాజమండ్రి నగరంలో, తునిలో శాంతియుత నిరసనలు చేపట్టిన జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. గిరిజన ప్రాంతం రంపచోడవరం, వి.ఆర్.పురంలలో బంద్ చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా :
టీడీపీ బంద్ నేపధ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు జనసేన ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, ఏలూరు ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, ఉండి నియోజకవర్గ నాయకులు జుత్తిగ నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చన్నమల్ల చంద్రశేఖర్ తదితరుల్ని పోలీసులు ఉదయమే హౌస్ అరెస్టు చేశారు. నరసాపురంలో టీడీపీ శ్రేణులతో కలసి శాంతియుత ర్యాలీలో పాల్గొన్న మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ ను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు.
ప్రకాశం జిల్లా :
టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపు నేపధ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకుల నిర్బంధాలు, అరెస్టులు కొనసాగాయి. శాంతియుత నిరసనకు సమాయత్తం అయిన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ని పోలీసులు ముందస్తు అరెస్టు గావించి స్టేషన్ లో నిర్బంధించారు. దర్శిలో నిరసన తెలియచేస్తున్న వరికూటి నాగరాజు తదితరుల్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా మరికొందరు ప్రధాన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో కలసి జనసేన నాయకులు శాంతియుతంగా బంద్ నిర్వహించారు. నిరసనల్లో పాల్గొన్న పలువురు నాయకులను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. మరికొంత మందిని ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. శాంతియుత నిరసన చేపట్టిన ఆత్మకూరు ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ సహా పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా :
తిరుపతి నగరంలో టీడీపీ బంద్ కి శాంతియుతంగా సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన జనసేన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణితో పాటు పలువుర్ని పోలీసులు అడ్డుకుని బలవంతంగా స్టేషన్ కి తరలించారు. పోలీసులతో పెనుగులాట సందర్బంగా కిందపడి రాజరెడ్డి గాయపడ్డారు. 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపధ్యంలో ఎటువంటి నిరసనలకు అనుమతి లేదంటూ శ్రీకాళహస్తి ఇంఛార్జ్ వినూత కోట, తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, మదనపల్లిలో డాక్టర్ మైఫోర్స్ మహేష్ తదితరుల్ని పోలీసులు ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా శాంతియుత నిరసనల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మదనపల్లిలో శాంతియుతంగా బంద్ చేస్తున్న పార్టీ రాయలసీమ కో కన్వినర్ గంగారపు రాందాస్ చౌదరిని అరెస్టు చేసి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
కడప జిల్లా :
ఉమ్మడి కడప జిల్లా, రైల్వే కోడూరులో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో పాటు పలువురు నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కి తరలించారు.
కర్నూలు జిల్లా :
ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన నాయకుల గృహ నిర్బంధాలు కొనసాగాయి. పాణ్యం ఇంఛార్జ్ చింతా సురేష్, ఎమ్మిగనూరు ఇంఛార్జ్ రేఖా గౌడ్, మైనారిటీ నాయకులు అర్షద్ తదితరులను ఉదయం నుంచే పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. వారి ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో శాంతియుత బంద్ లో పాల్గొన్నాయి. అనంత అర్బన్ లో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న నగర అధ్యక్షులు పొదిలి బాబురావుతో పాటు పార్టీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతపురం క్లాక్ టవర్ కూడలి వద్ద పెండ్యాల శ్రీలతను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరంలో శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేయగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి స్టేషన్ కి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు.
విశాఖపట్నం జిల్లా :
విశాఖ జిల్లా భీమిలిలో టీడీపీ నాయకులతో కలసి శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న జనసేన ఇంఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్లతో పాటు పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. విశాఖ ఉత్తర ఇంఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, నర్సీపట్నం నాయకులు రాజాన సూర్యచంద్ర తదితరుల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో శాంతియుత బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా :
విజయనగరం జిల్లా బొబ్బలిలో టీడీపీ శ్రేణులతో కలసి పార్టీ నాయకులు పాలూరి బాబు ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు శాంతియుతంగా బంద్ నిర్వహించారు. గజపతినగరంలో మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో :
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పార్టీ నాయకులు పెడాడ రామ్మోహన్, శ్రీకాకుళంలో గేదెల చైతన్య, పాలకొండలో గర్భాన సత్తిబాబులతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పార్టీ మండలాధ్యక్షులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు.