Friday, November 22, 2024

నవంబర్‌ 1 నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నవంబర్‌ 1వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలను అనుమతించరాదని అధికారులను ఆదేశించింది. సంబంధిత నగర, పట్టణాల్లో ని షేధాన్ని పటిష్టంగా అమలుచేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాల్లో ఫ్లెక్సీలు వినియోగించకుండా పర్యవేక్షించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్కో ఫ్లెక్సీపై రూ. 100 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పోలీసు, రవాణా, జీఎస్‌టీ అధికారులు తనిఖీలు నిర్వహించటంతో పాటు అతిక్రమించిన వారిపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో వివరించింది.

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ప్లాస్టిక్‌ స్థానే కాటన్‌, నేత వస్త్రాలను వినియోగించాలని తేల్చిచెప్పింది. విశాఖపట్నం బీచ్‌లో వ్యర్థాలను వేరుచేసే కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో ప్లాస్టిక్‌ వినియోగంపై త్వరలో నిషేధం విధిస్తామని ప్రకటించిన సంగతి విదితమే. కాగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఫ్లెక్సీలపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు అనుమతించాలంటూ పలువురు వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement