మంగళ గిరి: వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు నిన్న వైఎస్ జగన్ కు లేఖ పంపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంగళగిరి లోని జనసేన కార్యాలయంలో కలిశారు…
గంటపాటు ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం బయటికి వచ్చిన బాలినేని తన మాజీ పార్టీ వైసీపీతో పాటు మాజీ బాస్ వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. జనసేనలో తన చేరికపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు..
.ఒంగోలులో పవన్ కళ్యాణ్ సమక్షంలో సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరబోతున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. త్వరలో మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమం పెట్టుకుంటామన్నారు. తనతో పాటు పాటు చాలా మంది వైసీపీ నేతలు జనసేనలో చేరతారని బాలినేని తెలిపారు. వైఎస్ఆర్ తరవాత జగన్ పార్టీలో జాయిన్ అయ్యానని, మంత్రిగా రాజీనామా చేసి జగన్ వైపు వచ్చానని, జగన్ కోసం మంత్రి పదవి వదిలి వచ్చానని బాలినేని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
వైఎస్ఆర్ కుటుంబం కోసం మంత్రి పదవి వదిలి వచ్చానని,తనతో పాటు 17 మంది ఎంఎల్ఏ లు జగన్ కోసం రాజీనామా చేసి వచ్చారని బాలినేని తెలిపారు. ఆ 17 మందికి జగన్ న్యాయం చేయలేదన్నారు. సీఎం అయ్యాక 17 మంది మంత్రులుగా ఉంటారు, మీ తరవాతే మిగిలిన వాళ్ళు అన్నారని గుర్తుచేసుకున్నారు.
తనకూ బోస్ కి మంత్రి పదవులు ఇచ్చారని, అవీ మధ్యలో లాగేసుకున్నారని బాలినేని ఆక్షేపించారు. మిగిలిన 15 మందికి ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.వైఎస్సార్ పై ప్రేమతో ఇంతకాలం వైసీపీలో ఇబ్బందులు పడి కొనసాగిస్తున్నట్లు బాలినేని తెలిపారు.
ఎన్నికల ముందే జనసేనలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కుదరలేదన్నారు. ఎలాంటి డిమాండ్ లేకుండా జనసేనలో చేరుతున్నట్లు బాలినేని తెలిపారు.
పవన్ ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు. కూటమి నేతలతో కలిసి పని చేస్తానని, ఒంగోలులో అందరితో కలిసి ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. జగన్ ను కలిసిన ప్రతిసారి ప్రజా సమస్యల గురించే మాట్లాడానని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలానే చేస్తే చాలా విషయాలు బయట పెడతానని వైసీపీ నేతల్ని హెచ్చరించారు
ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ల కార్యకర్తలను ఎలా చూసుకుంటారో, జనసేన కార్యకర్తలను అలానే చూడాలని బాలినేని కోరారు. ఏమైనా తేడా వస్తే అధిష్టానంతో చెప్తానన్నారు.వైఎస్సార్ కోసమే వైసీపీలో అవమానాలు భరించానని, చాలా సార్లు ఏడ్చానని, కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయని బాలినేని గుర్తుచేసుకున్నారు.
ఇంత ఘోరంగా ఓడిపోయినా వైసీపీలో మళ్ళీ అదే కోటరీ నడుస్తుందన్నారు. కోటరీ విషయంలో వైసీపీలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఒంగోలులో ఉన్న ఎమ్మెల్యేలు రావడానికి రాజీనామా చేయాలనే ఆలోచన ఉందన్నారు