Friday, November 22, 2024

ఆన్ లైన్ టికెట్ జీవో రద్దు.. బాలయ్య ఏమన్నారంటే..

సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సరికొత్త జీవోను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవోతో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కలెక్షన్లకు భారీగా దెబ్బ పడింది. విడుదలైన తొలిరోజే సూపర్ హిట్ టాక్ సొంతంచేసుకున్న అఖండ సిమానికి ప్రభుత్వ జీవోతో కలెక్షన్లపై ప్రభావం చూపించారు. కరోనా సమయంలోనూ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. బాలకృష్ణ కేరియర్ లో తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరారు. అయితే, ప్రభుత్వం టికెట్ల రేటును తగ్గించకుండా ఉంటే.. వసూళ్లు మరో లెవల్ లో ఉండేవి. ప్రభుత్వం నిర్ణయంపై సినీ ఇండస్ట్రీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, తాజాగా ప్రభుత్వ జీవోను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేయడంపై హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు.

ఆన్లైన్ టిక్కెటింగ్ విధానంపై బాలయ్య మాట్లాడుతూ టికెటింగ్ విధానం ఉన్నప్పటికీ సినిమా బాగుందన్న ధైర్యంతో ముందుకు వెళ్ళామని అన్నారు. ఏపీ హైకోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేసినప్పటికీ ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ కు వెళ్తుందన్నారు. అయితే, అన్నింటికీ ప్రిపేర్ అయ్యి, సినిమా మీద, ప్రేక్షకుల మీద నమ్మకంతో అఖండను విడుదల చేశామన్నారు. ప్రేక్షకులు సినిమాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాము ధైర్యం చేసి ముందుకు వచ్చామన్నారు. దేవుడు కరోనా నుంచి కాపాడుతున్నాడని, అలాగే ప్రేక్షక దేవుళ్ళు సినిమాకు అఖండ విజయం అందించారన్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్న బాలయ్య.. ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసి దాన్ని నిరూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల, థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ ను నిన్న హైకోర్టు విచారించింది. సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. టికెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement