న్యూ ఢిల్లీ – సుప్రీం కోర్టులో బెయిల్ పై చంద్రబాబునాయుడకి ఊరట లభించింది. ది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ జరిపిన సుప్రీం తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ జరిపిన సుప్రీం తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.
రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం తేల్చిచెప్పింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది. అలాగే మధ్యంతర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనను కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.
కాగా.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. గత వారం సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. ఈరోజు విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. తాము చెప్పిన ఏ విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదని పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో వ్యాఖ్యలు చేసిందని.. వెంటనే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సర్కార్ కోరింది.
ఏపీ సీఐడి పిటిషన్‌లో కీలక అంశాలు..
‘‘చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది. కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉంది. 39 పేజీల తీర్పు మినీ ట్రయల్ నిర్వహణ జరిగిందనడానికి నిదర్శనం. దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి. అందుకు పూర్తి ఆధారాలున్నా హైకోర్టు ఏ మాత్రం పట్టించుకోలేదు. చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు. హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలి’’ అని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరింది.