అనకాపల్లి – సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి 300 రకాల వంటకాలు ఏర్పాటు చేసి… తియ్యటి బెల్లానికే కాదు ఆతిథ్యంలోనూ తీసుపోమని నిరూపించారు అనకాపల్లికి చెందిన సాయిగోపాల్. స్థానిక బియ్యం వ్యాపారి గుండా సాయిగోపాల్, మాధవి దంపతుల కుమార్తె రిషితను విశాఖపట్నంలోని మహారాణిపేటకు చెందిన దేవేంద్రనాథ్‌కు ఇచ్చి డిసెంబరు 15న వివాహం చేశారు.
సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడు, వారి కుటుంబ సభ్యులు సోమవారం అనకాపల్లి వచ్చారు. కారు దిగినప్పటి నుంచి పూలు జల్లుతూ ఇంటిలోకి స్వాగతం పలికారు. భోజనాల్లో 300 వంటకాలను వడ్డించారు. పులిహోర, దద్దోజనం, పలు రకరాల బిర్యానీలు, రకరకాల ఆవకాయలు, పలు పిండి వంటలతో పాటు పండ్లు, శీతలపానీయాలు ఇలా నోరూరించే ఎన్నో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. కేవలం గోదావరి జిల్లాకే పరిమితమైన ఇలాంటి మర్యాదలను అనకాపల్లి వారు చేయడం ఆనందంగా ఉందని పెళ్లి కుమారుడి తల్లి ఉషారాణి తెలిపారు. తమ కుటుంబ సభ్యులందరూ కలిసి మూడు రోజులపాటు ఈ వంటలు చేసినట్లు మాధవి తెలిపారు.