కడప బ్యూరో – ఆంధ్రప్రభకడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరంలో ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థిని దస్తగిరిమ్మ మృతి చెందారు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది..
శనివారం జరిగిన ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఘటనపై ఆరా తీసి విచారణ వేగవంతం చేయాలని, నిందితులను వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో పెట్రోల్ దాడికి పాల్పడిన నిందితుడు విగ్నేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం
.బద్వేల్ పట్టణం రామాంజనేయ నగర్ లో నివాసం ఉంటున్న దస్తగిరి, హుస్సేనమ్మ దంపతులకు కుమార్తె దస్తగిరిమ్మ ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన విగ్నేష్ ప్రేమ పేరుతో వెంటపడేవాడు. ఇతనికి వివాహమై కడప పట్టణంలో నివాసం ఉంటున్నాడు.
అయితే శనివారం దస్తగిరిమ్మ కు ఫోన్ చేసి మాట్లాడాలని పిలిచి గోపవరం మండలం సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. ఆమె దుస్తులకు నిప్పంటించి పరారయ్యాడు. స్థానిక పశువుల కాపర్లు, వ్యవసాయ పనులు చేసుకుంటున్న స్థానికులు గమనించి ఆమెను కాపాడారు.
హుటాహుటిన చికిత్స నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మంటల దాటికి 80 శాతం శరీరం కాలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున బాధిత విద్యార్థినీ దస్తగిరిమ్మ మృతి చెందారు. శరీరం 80 శాతం కాలిపోయిందని నిర్ధారించిన వైద్యులు బాధితురాలని ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు.
కానీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ దస్తగిరిమ్మ తుది శ్వాస విడిచారు. పోలీసుల అదుపులో విగ్నేష్..పెట్రోల్ దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిందితులను వెంటనే అరెస్టు చేయాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదేశించారు.
అయితే అప్పటికే ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు విగ్నేష్ కోసం గాలింపు చేపట్టారు. దీంతో శనివారం రాత్రి జిల్లా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జరిగిన ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.