ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనుంది. బద్వేల్లో తొలిగంటలో 9.5 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయడంతోపాటు వెబ్‌కాస్టింగ్ కూడా చేస్తున్నారు.
ఉపఎన్నిక బరిలో అధికార వైసీపీ సహా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో 2,15,292 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నియోజకర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వాటిలో 221 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరించారు. మొత్తం 3 వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఈ నియోజవర్గంలో 914 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలులో రికార్డు స్థాయిలో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతేస్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆధికారులు అంచనా వేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలతో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. చివరి గంటలో కోవిడ్ బాధితులు పీపీఈ కిట్లతో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.