గోదావరి నదిలో ఓ పిల్ల మొసలి జాలర్ల వలకు చెక్కినట్లు చిక్కి జారుకుంది. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఇవ్వాల జరిగింది. ఆత్రేయపురానికి చెందిన సుర్రావు అనే మత్స్యకారుడు మంగళవారం చేపల కోసం బడుగువానిలంక పల్లీల రేవులో వల ఏర్పాటు చేశాడు. దీంతో సుమారు రెండు అడుగులు పొడవు ఉన్న మొసలి పిల్ల చిక్కింది. తొలుత దాన్ని అందరూ ఉడుము అనుకున్నారు. తీరా దగ్గరకెళ్లి చూస్తే.. మొసలి పిల్ల కావడంతో ఉలిక్కి పడ్డారు.
ఈ విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున యువకులు అక్కడకు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీసారు. అయితే ఎక్కువ సేపు వలలోనే ఉన్న పిల్ల మొసలు గోళ్లతో వలను చీల్చుకుని గోదావరి నీటిలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం నీటి ప్రవాహం లేనందున మొసలి పిల్ల ఎక్కడకూ వెళ్లడానికి అవకాశం లేదు. దీంతో నిత్యం గోదావరిలో మసిలే రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఎందుకంటే రైతులు ఆ ప్రాంతంలోకే పశువులను తీసుకెళ్లతారు. అలాగే మహిళలు పుష్కర ఘాట్ లో బట్టలు ఉతకడానికి వెళ్లతారు. యువకులు, స్థానికులు స్నానాలు కూడా అదే రేవులో చేస్తుంటారు. వరదల సమయంలో ఇలాంటి మొసళ్లు వచ్చినప్పటికీ నీటి ప్రవాహానికి దిగువ ప్రాతాలకు వెళ్లి పోతుంటాయి. కానీ, ఇప్పుడు వరద ప్రవాహం అంతగా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.