ఉరవకొండ: చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపైనర్ వచ్చేసిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉరవకొండలో వైయస్ఆర్ ఆసరా కార్యక్రమంలో సీఎం పాల్గొని బటన్ నొక్కి డబ్బులు పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని జగన్ పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉందని ఉద్ఘాటించారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేశాడని గుర్తు చేశారు. అక్టోబర్ 2016 నుంచి ఆ అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేయడంతో పొదుపు సంఘాల రుణాలు కాస్త.. తడిసి మోపెడై వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు.
చంద్రబాబుకు మరో స్టార్ కాంపైనర్ వచ్చేసింది…
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలపై పరోక్ష విమర్శలు చేశారు. ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం, పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని అన్నారు. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడా చంద్రబాబు అభిమానులు కొందరు స్టార్ క్యాంపైనర్లుగా తయారయ్యారని ఆయన సెటైర్లు వేశారు. వై.ఎస్.షర్మిల, కాంగ్రెస్, బిజెపి, జనసేన పార్టీల పేర్లు ప్రస్తావించకుండా స్టార్ క్యాంపెయినర్లంటూ జగన్ పరోక్ష విమర్శలు చేశారు. చంద్రబాబును జాకీలు పెట్టి పైకెత్తేందుకు చాలామంది పనిచేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ చంద్రబాబుకు కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని విమర్శించారు.
పురందేశ్వరీ కూడా…
చివరకు చంద్రబాబు వదిన కూడా ఆయనకు స్టార్ క్యాంపైనరేనని పరోక్షంగా పురందేశ్వరిపై విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడా చంద్రబాబుకు స్టార్ క్యాంపైనర్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్టార్ క్యాంపైనర్లు కొందరు బీజేపీలో తలదాచుకున్నారని ఆయన విమర్శించారు. పలు వేదికలపై విశ్లేషకులు, మేధావుల పేర్ల మీద వీరే బయటకు వస్తారన్నారు. జెండాలు జతకట్టడమే వారి అజెండా అని సీఎం జగన్ విమర్శించారు. జనం గుండెల్లో గుడి కట్టడమే తన అజెండాగా సీఎం చెప్పారు. మీరే తన స్టార్ క్యాంపెయినర్లు అంటూ తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మీరే నా సైనికులు అంటూ ఆయన ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మంచి పనులు కొనసాగుతాయన్నారు.