తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై నమోదైన బాబ్లీ కేసు ఎట్టకేలకు రద్దైపోయింది. ఈ కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కోర్టు నిర్ణయంతో చంద్రబాబు సహా ఆయనతో కలిసి అప్పట్లో బాబ్లీ ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగిన 22 మంది సీనియర్ లీడర్లకు ఉపశమనం లభించింది.
బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు అందుకు నిరసనగా ప్రాజెక్టు వద్దే ధర్నా చేయాలని నిర్ణయించారు. 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ ధర్నాకు అనుమతి లేదని పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు చంద్రబాబు సహా టీడీపీ నేతలను అక్కడే ఓ గదిలో పోలీసులు నిర్బంధించారు.
అంతేకాకుండా చంద్రబాబు సహా 23 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణను చేపట్టిన నాంపల్లి కోర్టు.. పలు దఫాలుగా కేసును విచారించింది. కేసు విచారణ అలా కొనసాగుతుండగానే.. ఇట్టే 17ఏళ్ల సమయం గడిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. నాడు చంద్రబాబుతో కలిసి బాబ్లీ వద్ద ధర్నాకు యత్నించిన చాలా మంది టీడీపీ నేతలు ఆ తర్వాత ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. తెలంగాణకు చెందిన నేతలంతా ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఈ కేసు విచారణ కోసమంటూ మంగళవారం నాంపల్లి కోర్టుకు నేతలు వచ్చారు. కేసును విచారించిన కోర్టు కేసును కొట్టివేస్తున్నట్లుగా ప్రకటించింది. వెరసి 17 ఏళ్ల కిందట నమోదైన ఈ కేసులో చంద్రబాబు సహా 23మంది రాజకీయ నేతలకు ఊరట లభించింది.