ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు.
అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్… అయ్యన్నపాత్రుడిని స్పీకర్ ఛైర్ వద్దకు తీసుకెళ్లారు. సభాపతి స్థానంలో కూర్చొబెట్టారు. ప్రొటెం స్పీకర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత చంద్రబాబు… స్పీకర్ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి ప్రస్థానంపై ప్రశంసలు గుప్పించారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది.
అయ్యన్నపాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న…ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.