అమరావతి, ఆంధ్రప్రభ : యాంటీ బయోటిక్ మందుల వినియోగంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు సూచించారు. మంగళగిరిలోని ఎపిఐఐసి ఆరో ప్లnోర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ యాక్షన్ ప్లాన్ ఫర్ కం-టైన్మెంట్ ఆఫ్ ఎఎంఆర్ రిపోర్ట్ ను ఆయన విడుదల చేశారు. అనంతరం ఎఎంఆర్ కట్టడిలో భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ విలేజ్ హెల్త్ క్లినిక్ ల స్థాయిలో మెడికల్ ఆఫీసర్లు ఎఎంఆర్ కట్టడికి పనిచేయాలన్నారు.
యాంటీ బయోటిక్స్‌పై అవగాహన కల్పించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎఎంఆర్ పై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లకు కూడా అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు పూర్తి స్థాయి వ్యవస్థ ఏర్పడిందన్నారు. యాంటీ బయోటిక్స్ దుష్ప్రభావాలపై విలేజ్ హెల్త్ క్లినిక్ ల మెడికల్ ఆఫీసర్లు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. ఎఎంఆర్‌పై కార్యాచరణను రూపొందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని, ఇందుకు గాను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు.
ఎఎంఆర్ కట్టడిలో ఇతర రాష్ట్రాల కు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని కృష్ణబాబు పేర్కొన్నారు. యాంటీ- బయోటిక్స్ పై మేలుకొని భవిష్యత్ తరాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అందుకు గాను వీలైనంత త్వరగా ఎఎంఆర్ కట్టడికి చర్యలు తీసుకోవలసిందేనన్నారు. ఎఎంఆర్ కట్టడిలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవను స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ సందర్భంగా అభినందించారు.