కర్నూల్ బ్యూరో : పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండటం మంచిదని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రతీ ఏటా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన కల్గి ఉండటం మంచిదని జిల్లా ఎస్పీ సూచించారు. ఓపెన్ హౌస్ లోని ఆయుధాల గురించి విద్యార్ధులకు జిల్లా ఎస్పీ అవగాహన కల్పించారు. ఎలాంటి సందర్భంలో ఏ ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పనితీరు గురించి తెలిపారు.
పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 26, 27 తేదీల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసు వ్యవస్ధ పనితీరు గురించి, పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాల గురించి కళాశాల, పాఠశాల విద్యార్దినీ, విద్యార్దులు తెలుసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, నారాయణ, జావేద్, ఆర్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, నగరంలోని పలు విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు.