( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) ద్వారా ప్రజలకు అందించే స్కీమ్స్ పట్ల అవగాహన పెంచాలని, ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో సెంట్రల్ ఫండింగ్ ద్వారా ఎంటర్ ప్రెన్యూర్స్ ను అభివృద్ధి చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) ఎన్టీఆర్ జిల్లా అధికారులతో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మంగళవారం ఎన్టీఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో 2024-25 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను ఎంపి కేశినేని శివనాథ్ విడుదల చేశారు.
అనంతరం అధికారులతో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గం లోని జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు జరుగుతున్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ పథకాలపై, ముఖ్యంగా కేంద్ర పథకాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పై అవగాహన పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అవగాహన సదస్సులో ఎంఎస్ఎంఈ స్కీమ్స్ తీసుకుని ఎంటర్ ప్రెన్యూర్స్ గా రాణిస్తున్న వారి సక్సెస్ స్టోరీస్ ప్రజలకు వివరించేలా చూడాలని సూచించారు.
యూనిట్ ఎలా స్థాపించుకోవాలి. యూనిట్ లో తయారు చేసిన ప్రొడక్ట్స్ ను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. ముఖ్యంగా బ్యాంక్ రుణం ఎలా తీసుకోవాలి…తిరిగి ఎలా చెల్లించాలనే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెలలో విజయవాడ నియోజకవర్గంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని అధికారులకి చెప్పారు.. అలాగే అధికారులు సెంట్రల్ స్కీమ్ ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరే పథకాలను ఎంపి కేశినేని శివనాథ్ కి వివరించారు.
గ్రామీణ నిరుద్యోగ యువత (18-35 సంవత్సరాలు) కి మార్కెట్ ఆధారిత నైపుణ్య అభివృద్ధి ప్రోగ్రామ్‌లలో ఎంతమంది యువతకు శిక్షణ ఇచ్చారు..శిక్షణ పొందిన వారిలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు చూపించటం జరిగిందనే వివరాలు ఎంపి కేశినేని శివనాథ్ అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాకు తన వంతు సహకారం అందిస్తానని అధికారులకి ఎంపి కేశినేని శివనాథ్ చెప్పటం జరిగింది.
ఈ సమావేశంలో విజయవాడ కె.వై.ఐ.సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రీప్, ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ స్కిల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాస్ , ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఎన్.ఎస్.ఐ.సి కిరణ్ , జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ ఇండిస్ట్రియల్ సెంటర్ సాంబయ్య, ఎన్టీఆర్ జిల్లా ఎల్.డి.ఎమ్. ప్రియాంక, డిస్ట్రిక్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ విక్టర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా ఎ.పి.ఎస్.ఎస్.డి.సి, పి ఎ.డి.ఎస్.పి.వో .దుర్గా ప్రసాద్, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి డిపివో ఎ.మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.