అమరావతి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రథమ పౌరురాలు.. గ్రామానికి సేవలందిస్తూనే ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఎం-టెక్ టాపర్‌గా నిలిచి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు సర్పంచ్ మౌనిక చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్నారు. ఎమ్మిగనూరు సరస్వతి విద్యానికేతన్‌లో పదవ తరగతి, చిత్తూరు ప్రభుత్వ పాలి-టె-క్నిక్ కళాశాలలో డిప్లొమో, ప్రొద్దుటూరు యోగి వేమన విశ్వ విద్యాలయం పరిధిలో బీ-టె-క్ పూర్తి చేశారు.
పెద్దమర్రివీడు గ్రామ సర్పంచ్ పదవి రిజర్వేషన్‌లో భాగంగా మహిళలకు కేటాయించారు. తండ్రి నరసన్న ప్రోత్సాహంతో ఫిబ్రవరి, 21, 2021న జరిగిన ఎన్నికల్లో మౌనిక పోటీలో నిలిచి విజయం సాధించారు. ఓ వైపు సర్పంచ్‌గా సేవలందిస్తూ అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఎం-టెక్ పూర్తిచేశారు. 89.92 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచారు. అనంతపురం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన 12వ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ ఎంఎస్ నాయుడు మెమోరియల్ బంగారు పతకాన్ని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..