Friday, November 22, 2024

Delhi | అవినాశ్ రెడ్డి బెయిల్ కేసు విచారణ వాయిదా.. అందుబాటులో లేని న్యాయవాది!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (వైఎస్సార్సీపీ) ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా పడింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే సునీత తరఫున వాదనలు వినిపించాల్సిందిగా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ సునీత రెడ్డి ధర్మాసనాన్ని కోరారు.

విచారణ 3 వారాలకు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మే 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాశ్ రెడ్డి అని, దర్యాప్తు సంస్థకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని సునీత రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా సునీత వాదనతో ఏకీభవిస్తూ అవినాశ్ పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. వివేకా హత్యకు అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సూత్రధారులు అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement