ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆకుల వెంకట శేషసాయి నియామకం అయ్యారు. ఇక్కడ పనిచేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా వెళ్లడంతో ఆయన ప్లేస్లో వెంకట శేషసాయిని కేంద్ర న్యాయశాఖ నియమించింది. ఇక.. ప్రశాంత్కుమార్తో పాటు సీనియర్ అడ్వొకేట్ కేవీ విశ్వనాథన్ కూడా సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.
ఇక.. సుప్రీంకోర్టులో పని చేయాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా, ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎం ఆర్ షా.. ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. దీంతో ఈ సంఖ్య 32కు పడిపోయింది. ఈ క్రమంలో వారిద్దరి ఖాళీలను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేవీ విశ్వనాథన్‌తో భర్తీ చేసింది సుప్రీంకోర్టు.
కాగా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బదిలీ చేస్తూ, సీనియర్ అడ్వొకేట్ కేవీ విశ్వనాథన్‌ను న్యాయమూర్తిగా ఎలివేట్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులను పంపించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలో జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన కొలీజియం పంపించిన ఈ సిఫారసులను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ యధాతథంగా ఆమోదించింది.