అనంతపురం, (ప్రభ న్యూస్ బ్యూరో ) : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోకి హై ఓల్టేజ్ వైర్లు తాకడంతో కాలి బూడిదయ్యింది. ఇందులో ప్రయాణిస్తున్న 10మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తాడిమర్రి మండలంలో ఇవ్వాల (గురువారం) ఉదయం జరిగింది..
వాళ్లంతా కూలీలు తెల్లవారుజామునే పనులకోసం పొలాలకు ఆటోలో వెళ్తున్నారు. హై వోల్టేజ్ విద్యుత్ వైర్లు వారికి మృత్యు శాపాలుగా మారిపోయాయి. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎనిమంది కూలీలతో తాడిమర్రి మండలానికి చెందిన గుండంపల్లి గ్రామవాసులు సమీప పొలాలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైన ఉన్న వైర్లు కిందకు వచ్చాయి. వాటిని ఆటో డ్రైవర్ గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. ఒక్కసారిగా విద్యుత్ ప్రమాదానికి గురి అయి నిప్పులు అంటుకున్నాయి. ఆటోలో ఎనిమిది మంది దాకా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే ఆరు మంది శవాలను గుర్తించారు. విద్యుత్ ప్రమాదానికి మసి అయిపోయారు. ఆటో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని స్థానిక గుండంపల్లి గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతులంతా కూలీలు కావడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. సంఘటనపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ, పరిటాల శ్రీరామ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.