Thursday, November 21, 2024

మామూళ్ల మ‌త్తులో అధికారులు.. కోట్లకు పడగలెత్తిన గుట్కా డీలర్లు

విజయవాడ, ప్రభన్యూస్ : ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల నివారణకు పోలీసులు అడపాదడప దాడులు నిర్వహిస్తున్నారు. అయితే దాడుల్లో పట్టుబడింది కొంతే. రహస్య స్థావరాలలో భారీ నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. పోలీసులు తలచుకుంటే గుట్కా నిర్మూలించడం పెద్ద సమస్య కాదు. ఎందుకో గాని కొంతమంది అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదంటున్నారు.. పోలీస్‌ శాఖలో కొందరు మామూళ్లకు అలవాటు పడిన అధికారులు దాడుల విషయం గురించి ముందస్తుగానే గుట్కా వ్యాపారులకు సమాచారం అందజేస్తున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. గుట్కా మాఫియాకు చెందిన డీలర్ల రహస్య స్థావరాలపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రైవేట్‌ ట్రాన్స్పోర్ట్‌ సంస్థల వాహనాలతో పాటు, రైల్వే పార్సెల్‌ సర్వీస్‌ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోకి కోట్ల రూపాయల విలువైన గుట్కా దిగుమతి అవుతుంది. నిషేధాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోంది. గుట్కా మాఫియా ఆయా ప్రాంతాల్లో అడిగిన వారికల్లా నెలవారి మామూలు చెల్లిస్తూ వ్యాపారాన్ని నిరాఘాటంగా సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా గుట్కా ప్యాకెట్లు నిరాటంకంగా సరఫరా చేస్తున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ముందుగానే గుట్కా మాఫియాకి కొంతమంది పోలీసులు సమాచారం చేరవేయడంతో వారు జాగ్రత్త పడుతూ ఉంటారు.

జిల్లాలో గుట్కా మాఫియా నడిపిస్తున్న సూత్రధారులు పట్టుకోవడంలో వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాత్రధారులు పైన కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం ఉంది. దీంతో గుట్కా మాఫియా ఆగడాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి జిల్లాను గుట్కా రహిత జిల్లాగా ప్రకటించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుట్కా, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయిస్తు వ్యాపారుల దందాను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement