Tuesday, November 26, 2024

సినీ ఫక్కీలో బంగారం దోపిడీకి యత్నం.. ఈడి అధికారుల పేరుతో వ్యాపారులకు బెదిరింపు

నెల్లూరు(క్రైం), (ప్రభ న్యూస్‌) : ఇటీవల విడుదలైన హీరో సూర్య నటించిన గ్యాంగ్‌ సినిమాలో ఇన్‌కం ట్యాక్స్‌, విజిలెన్స్‌, ఈడి, సీఐడి అధికారులమంటూ బంగారు దుకాణాలు, రాజకీయ నాయకుల ఇళ్లల్లో దాడులు చేసి బంగారం, నగదు దోచుకున్న తరహాలోనే సినీఫక్కీలో ఓ ముఠా ఓ బంగారు దుకాణంలోకి చొరబడి పోలీసు యూనిఫాం ధరించి నకిలీ తుపాకీతో వ్యాపారులను బెదిరించి సుమారు 12 కిలోల బంగారాన్ని దోచుకెళ్లుందుకు స్కెచ్‌ వేశారు. అయితే ఎటువంటి రికార్డులు పరిశీలించకుండా, క్రయవిక్రయాలకు సంబంధించి అకౌంట్స్‌ చూడకుండా బంగారం మూటకట్టడంతో అనుమానం వచ్చి వ్యాపారస్తులు ఆ ముఠా సభ్యులను చుట్టుముట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నగరంలో శుక్రవారం సంచలనం రేపింది.

నగరంలోని కాకర్లవారి వీధిలో సునీల్‌, ప్రసాద్‌ అనే సోదరులు లావణ్య జూవెలర్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వారి దుకాణం ముందు ఓ ఇన్నోవా వాహనం వచ్చి ఆగింది. అందులో నుండి 5 మంది వ్యక్తులు, ఎస్సై యూనిఫాం ధరించిన మరో వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి ముందుగా షెటర్లు మూసివేశారు. తాము ఈడి అధికారులమని దుకాణ యజమాని సునీల్‌కు చెప్పి మీ వద్ద లెక్కకు మించి బంగారం ఉందని సమాచారం వచ్చిందని, తమకు సహకరిస్తే మీ ఒక్కరితోనే పోతుందని, లేదంటే మిగిలిన మీ బంధువులు, ఇతర దుకాణాలపై కూడా దాడులు చేస్తామని బెదిరించారు. యూనిఫాం ధరించిన వ్యక్తి తుపాకీ తీసి వ్యాపారస్తులను చెప్పినట్టు వినాలని, అధికారులకు సహకరించాలని బెదిరింపులకు గురిచేశాడు.

మీ కార్యాలయం ఎక్కడ అని వ్యాపారస్తులు ప్రశ్నించినప్పటికి వారు సరైన సమాధానం చెప్పకుండా సుమారు రూ.7 కోట్లు విలువ చేసే 12 కిలోల బంగారాన్ని మూటకట్టారు. అయితే ఎటువంటి రికార్డులు, అకౌంట్స్‌ చూడకుండానే బంగారం మూటకట్టి కారు ఎక్కే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు శాంతిలాల్‌ జైన్‌, అమరా మోహన్‌రావు, ఇతర వ్యాపారస్తులు అనుమానం వచ్చి వారిని చుట్టుముట్టారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ట్రాఫిక్‌ డీఎస్పీ ఎండి అబ్దుల్‌ సుభాన్‌, సంతపేట ఇన్‌స్పెక్టర్‌ షేక్‌. అన్వర్‌బాషా, ఎస్సైలు, సిబ్బంది అక్కడికి చేరుకునేటప్పటికే వ్యాపారస్తులు ఆ ముఠా సభ్యులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆరు మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇన్నోవా వాహనం, తుపాకీని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

పట్టుబడిన ముఠా సభ్యులు సత్యసాయి జిల్లా కనగానిపల్లికి చెందిన ఎ. రమేష్‌, జి. బాబు, యోగానందగౌడ్‌, కర్నూలుకు చెందిన మద్దిలేటి గౌడ్‌, జి. బాలకృష్ణ, హైదరాబాద్‌కు చెందిన జి. కిషోర్‌రావులుగా పోలీసులు గుర్తించారు. వీరు వినియోగించిన ఇన్నోవా వాహనం బాలాజీనగర్‌ సెంటర్లో అద్దెకు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వీరు మరో ఇన్నోవా వాహనాన్ని కనుపర్తిపాడు క్రాస్‌ రోడ్డు వద్ద పార్కింగ్‌ చేసి ఉండడాన్ని పోలీసులు విచారణలో తెలుసుకుని ఆ వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. సీఐ అన్వర్‌బాషా ముఠా సభ్యులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement