ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులకు రక్షణ కరువైందని దోపిడీ పెరిగిందని ఏఐకెఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏఐకెఎస్ సిసి జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్,కో కన్వీనర్లు సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు, జిల్లా నాయకులు చిర్ర సూరి, సుద్ధమల్ల భాస్కర్, బీరం రాములు, వల్లందాస్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈరోజు అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్ సిసి) ఆధ్వర్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కోడిపెళ్లి రాజు అనే రైతుపై షణ్ముఖ ట్రేడర్స్ యజమాని పురుషోత్తం జరిపిన దాడిని నిరసిస్తూ మార్కెట్లో రైతులకు రక్షణ కల్పించి రైతుల పంటలను స్వేచ్ఛగా అమ్ముకునే వాతావరణం కల్పించాలని కోరుతూ మార్కెట్ కార్యాలయం గేటు ముందు బాధిత రైతాంగం తో కలిసి ఆందోళన చేపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్,సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పండిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు తీసుకు వస్తే దళారుల రాజ్యం నడుస్తోందని రైతులు కనీస స్వేచ్ఛగా తమ పంటలను అమ్ము కోలేని స్థితి నెలకొందని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆశాలపెళ్లి రైతు కోడి పల్లి రాజుపై జరిగిన దాడి అని మార్కెట్ వ్యవస్థ రైతులకు అనుసంధానంగా ఉండాలి తప్ప రైతులను దోచుకునే వాళ్లకు అండగా ఉండడం సరికాదన్నారు. రైతులే మార్కెట్ వ్యవస్థకు జీవనాధారం తప్ప మరొకటి లేదని ఇది గమనించి మార్కెట్ అధికారులు వ్యాపారులు ఖరీదు దారులు అడ్తిదారులు నడుచుకోవాలని లేకపోతే వ్యవస్థ కుంటుపడుతుందని హెచ్చరించారు.
ఆసియాలోనే అతిపెద్ద ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులకు రైతుల పంటలకు రక్షణ కల్పించి స్వేచ్ఛాయుత వాతావరణంలో తమకు నచ్చిన వారికి పంట నమ్ముకునే విధంగా చర్యలు చేపట్టి మద్దతు ధరకు మించి డిమాండ్ కనుగుణంగా ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మార్కెట్ అధికారులను కోరారు.
అలాగే కొడిపెళ్లి రాజు అనే రైతు పై విచక్షణారహితంగా దాడికి పాల్పడి తెచ్చిన పత్తి బస్తాలను నియంతృత్వంగా స్వాధీనం చేసుకున్న షణ్ముఖ ట్రేడర్స్ లైసెన్స్ రద్దు చేసి యజమాని పురుషోత్తం పై చట్టరీత్యా చర్యలు తీసుకొని మార్కెట్ కు వచ్చే రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డి ఎం ఓ ప్రసాదరావు మార్కెట్ కార్యదర్శి బి వి రాహుల్ లకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, వివిధ రైతు సంఘాల నాయకులు ఎన్ రెడ్డి హంసా రెడ్డి, ఓదెల రాజయ్య, దామరకొండ కొమురయ్య,రాకేష్, శ్రీనివాస రావు, రమేష్, కోటి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.