Wednesday, November 13, 2024

ఉపాధ్యాయుడి పై దాడి…విద్యార్థి తండ్రి వీరంగం…

మండపేట: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి పైనే దాడికి పూనుకోవడం, ఆపై ఇది తమ సొంత ఊరని ఎక్కడ ఏ మాస్టార్ నైనా చితక్కొట్టొచ్చ‌ అంటూ విద్యార్థి కి తండ్రి రెచ్చగొట్టడం… ఇది మండపేట మండలం ద్వార పూడిలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. సినిమా, సోషల్ మీడియా ప్రభావం ఇలాంటి జాడ్యాలకు మూలంగా మారుతుంది. భవిష్యత్తు తీర్చిదిద్దే అధ్యాపకులకు రక్షణ కరువైతే ఇక వారెలా పాఠాలు చెబుతారు. కొందరు ఆకతాయిల వల్ల మొత్తం ఆ పాఠశాలలో విద్య వ్యవస్థ భ్రష్టు పట్టే ప్రమాదకరమైన స్థితి నెలకొంది.

ప్రవర్తన పై ప్రశ్నిస్తే…. :
మండపేట మండలం ద్వార పూడిలోని ఎస్ సి హెచ్ కె వి ఎన్ ఆర్ జెడ్ పి ఉన్నత పాటశాలలో పదవతరగతి ఏ సెక్షన్ లో ఓ విద్యార్థి అసభ్య దూషణ చేయడంతో సంబంధించిన క్లాస్ టీచర్ ఆ విద్యార్థి తల్లిదండ్రులను తీసుకుని రావాలని కోరారు. దీంతో ఆ విద్యార్థి తన తండ్రి ఏడిద చిన బైరాగిని స్కూల్ కు తీసుకొని వచ్చాడు. అప్పుడే భోజన విరామ సమయం కావడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది లంచ్ చేస్తున్నారు. నేరుగా అక్కడికి వచ్చిన బైరాగి అక్కడ ఉన్న జీవ శాస్త్ర ఉపాధ్యాయులు సి హెచ్ లక్ష్మణరావు వద్ద వచ్చి ఎలాంటి సంభాషణలు లేకుండానే దాడి చేసాడు. సహా ఉపాధ్యాయులు వారిస్తున్నా ఆగలేదు. ఆ పై ఇక్కడ మందే చట్టం… ఎవడు అడ్డొస్తే వాడికి పడతాయి అంటూ హెచ్చరించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా తన కుమారుడిని రెచ్చగొట్టి ఇష్టమొచ్చిన వారిని చితక్కొట్టు అంటూ మోటర్ సైకిల్ పై వెళ్లి పోతూ గేటు వద్ద ఉన్న ఉపాధ్యాయులు గండి స్వామి ప్రసాద్ ను ఢీకొట్టాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. దీంతో తేరుకున్న ఉపాధ్యాయులు గాయపడ్డ మాస్టారు లక్ష్మణరావు ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దీనిపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇదే పాఠశాల కు చెందిన కొందరు బాలురు గ్రామంలో అలజడి సృష్టించి అల్లరి చిల్లర గా తిరుగుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతూ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇక్కడ వ్యాయమ ఉపాధ్యాయులు పాండ్రంకి శ్రీనివాస్ విద్యార్థులను క్రమశిక్షణ గా ఉంచేవారని ఆయన బదిలీ అనంతరం క్రమశిక్షణ కొరవడిందని కొందరు చెబుతున్నారు. గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెర, ఉప సర్పంచ్ తులా శేషారావు, వైఎస్సార్సీపీ నేత దంతులూరి శ్రీ రామ వర్మ తదితరులు ఉపాధ్యాయులకు అండగా నిలబడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement