సీఎం జగన్ పై రాయి దాడి ఘటన నేపథ్యంలో ఆయన భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. గుత్తిలో జగన్ కాన్వాయ్ పై చెప్పులు.. ఇప్పుడు రాళ్లు విసరడంతో హైఅలర్ట్ ప్రకటించింది. సభల్లో ర్యాంప్ వాక్ చెయ్యొద్దని జగన్ కు భద్రతాపరమైన సూచనలు చేసింది.
జగన్, జనానికి మధ్య బారికేడ్లు ఉండాలని భద్రతా సిబ్బందికి సూచించింది. క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలు తగ్గించాలని.. వీలైనంత వరకూ బస్ లో కూర్చునే రోడ్ షోలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్ధం విధించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
భద్రతా వైఫల్యంపై వివరణ కోరిన ఈసీ..
మరోవైపు, సీఎం జగన్ పై దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. ఇటీవల చిలకలూరిపేటలోని ప్రధాని సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది. ఎన్నికల సమయంలో రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వీఐపీల భద్రతలో వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేసింది.