Tuesday, November 26, 2024

AP | నాడు చంద్రబాబుపై దాడి.. నేడు ఐదుగురు అరెస్టు !

(ఆంధ్రప్రభ, నందిగామ) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభమైంది. 2022 నవంబర్ 5న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా నందిగామ పర్యటన సందర్భంగా “బడుడే బడుడు” బహిరంగ సభలో ఆయన కాన్వాయ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు.

చంద్రబాబు ప్రసంగిస్తుండగా జరిగిన ఆ రాళ్ల దాడిలో ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావు కంటికి తీవ్ర గాయం అయింది. దాడి జరుగుతున్న సందర్భంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రాళ్లు కాన్వాయ్ పైకి వస్తుండడంతో సెక్యూరిటీ అప్రమత్తమై చంద్రబాబుకు కవచంలా నిలబడడంతో ఆ ప్రమాదం నుండి ఆయన తప్పించుకున్నారు.

అప్పట్లో సంచలమైన ఈ దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు. అయితే అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ ఫిర్యాదుపై ఎటువంటి విచారణ చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుల పై విచారణ ప్రారంభించిన ఇప్పటి పోలీసులు చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్నారు.

బాడుడే బాదుడు కార్యక్రమం జరిగిన ప్రదేశంలోని సిసి ఫుటేజ్ లతో, దగ్గరలో ఉన్న ప్రజలను స్థానికులను అప్పట్లో జరిగిన అంశంపై విచారణ పూర్తిస్థాయిలో చేశారు. హనుమాన్ నిధులపై పూర్తి నిగా ఉంచిన స్థానిక పోలీసులు పక్కా సమాచారం ఆధారాలను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సేకరించారు.

ఈ క్రమంలోనే ఈ దాడికి సంబంధించి భాగస్వాములుగా ఉన్న ఐదుగురిని శనివారం నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న పోలీసు అధికారులు, పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దాడికి గల కారణాలు, ప్రేరేపించిన వారి వివరాలు, అందులో భాగస్వాములైన వారి వివరాలతో పాటు జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలను వివరాలను సేకరించే పనిలో ప్రస్తుతం ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement