నారా చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పీపుల్స్‌వార్ గ్రూపు పక్కా ప్రణాళికతో మందుపాతర పేల్చడంతో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పీపుల్స్‌వార్ గ్రూపు అగ్రనేతలు సహా మొత్తం 33 మందిపై కేసులు నమోదయ్యాయి.
వీరిలో తిరుపతికి చెందిన జి.రామమోహన్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎస్. నరసింహారెడ్డి, కేశవపై విచారణ అనంతరం తిరుపతి సహాయ సెషన్స్ న్యాయస్థానం ఒక్కొక్కరికీ నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ 2014లో తీర్పుచెప్పింది. దీంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిన్న తీర్పు వెలువడింది. తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్సు న్యాయస్థానం ఇన్‌చార్జ్ న్యాయమూర్తి జి.అన్వర్ బాషా వీరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు.
ఇదే కేసులో గతంలో కడప జిల్లాకు చెందిన ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డి, జోతెం నాగార్జున, కొల్లం గంగిరెడ్డి, ఎన్.పాండురంగారెడ్డికి కింది కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును వారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత కేసు తిరుపతిలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ అయింది. విచారణ అనంతరం 2012లో గంగిరెడ్డి, పాండురంగారెడ్డి నిర్దోషులుగా విడుదల కాగా, రామస్వామిరెడ్డి, నాగార్జునపై రివిజన్ పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉంది.