– నెల్లూరు(వైద్యం)(ప్రభ న్యూస్)
నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒకేసారి ఎనిమిది చనిపోవడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రి తీరుపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యాధికారుల నిర్లక్ష్యం, అవసరమైన వైద్య పరికరాల వినియోగంలో, సమకూర్చడంలోనూ వైఫల్యంపై అనేక ఆరోపణలు, విమర్శల వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం వారికి పుండుమీద కారం చల్లినట్టు అవుతోంది. ఆస్పత్రిలో సరైన ఫెసిలిటీవ్ లేవన్న పలు అనుమానాలు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో సర్వజన ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. అక్కడ జరుగుతున్న వైఫల్యాలపై అక్కడే పనిచేస్తున్న ఎంతో మంది ఆవేదన చెందుతున్నప్పటికీ ఆ విషయాలను బయటకు చెప్పేందుకు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో జీజీహెచ్ వ్యవహారం కలకలం రేపింది.
వివిధ ప్రసార మాధ్యమాల్లో జీజీహెచ్‌లో చోటుచేసుకున్న ఈ దారుణంపై కథనాలు వెలువడడంతో సంచలనంగా మారింది. శుక్రవారం ఒకేరోజు 8 మంది చనిపోయారని సమాచారం అందుతున్నప్పటికీ ఆరుగురే అని వైద్యాధికారులు ప్రకటించారు. చనిపోయిన వారిలో నెల్లూరు నగరం స్టోన్‌హౌస్‌పేటకు చెందిన ఎస్ లలిత (62), శ్రీనివాసనగర్‌కు చెందిన ఎన్. చలపతి(52), వేదాయపాలెంకు చెందిన వై. సుందరం(70), కోటమిట్టకు చెందిన చెంచమ్మ(70), తోటపల్లి గూడూరు మండలం నరుకూరుకు చెందిన పి. రమేష్(42)తో పాటు సాంబయ్య ఉన్నట్టు అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
అయితే ఒకరోజు అంత మంది చనిపోవడం, ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కథనాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్‌తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. పెంచలయ్య, సంబంధిత శాఖల అధికారులందరూ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఇదే సందర్భంలో వామపక్ష నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేసి జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిని ఉపేక్షించవద్దని డిమాండ్ చేశారు.
అలాగే నగర మేయర్ పోట్లూరి స్రవంతి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిలు జీజీహెచ్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని వీడాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఓ వైపు ఉన్నతాధికారులు, మరోవైపు వివిధ పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు జరిగిన ఘటనను నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఉండగా ఓ బాధితుడు మద్యం మత్తులో తన భార్యకు వైద్యసేవలు అందించడంలో ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేయడం కొసమెరుపు..
————————————————
ఆక్సిజన్ కొరతతో చనిపోయారనడం వాస్తవం కాదు: కలెక్టర్ హరినారాయణన్
జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆక్సిజన్ అందక ఆరుగురు చనిపోయారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, వారంతా అనారోగ్యంతో చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారని కలెక్టర్ ఎం. హరినారాయణన్ పేర్కొన్నారు. ప్రసార మాధ్యమాల్లో జీజీహెచ్‌లో జరిగిన ఘటనపై వచ్చిన కథనాల నేపధ్యంలో ఆయన శనివారం సాయంత్రం జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎంఐసీయు వార్డును, ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులు కూడా ఆసుపత్రిలో బాగా చూస్తున్నారని, వైద్యులు అందుబాటులో ఉంటున్నారని ఆయనకు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై డీఎంఅండ్‌హెచ్‌ఓ, సూపరింటెండెంట్‌తో పూర్తి స్థాయిలో విచారణ జరిపించామన్నారు. చనిపోయిన ఆరుగురు కూడా అనారోగ్య కారణాలతో మృతి చెందారని వైద్యులు నిర్ధారించారని, వారంతా కూడా పెద్ద వయస్సు కలిగిన వారని పేర్కొన్నారు. ఎంఐసీయులో అత్యవసర కేసులకు వైద్య చికిత్సలు అందుతున్నాయని, వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండి రోగులను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత లేదని, 23 కె.ఎల్ లిక్విడ్ ఆక్సిజన్ 24 గంటలు అందుబాటులో ఉందని, పైపులైన్‌ల ద్వారా పూర్తి స్థాయిలో సరఫరా జరుగుతుందని తెలిపారు.