Friday, November 22, 2024

AP: మంత్రి బుగ్గ‌నపై అట్రాసిటీ కేసు..

పోలింగ్ రోజున ఎస్సీ అభ్య‌ర్ధి పై దాడి
కులం పేరుతో దూష‌ణ
సీరియ‌స్ గా తీసుకున్న పోలీసులు
మంత్రితో పాటు 30మంది అనుచ‌రుల‌పై కేసు న‌మోదు
ఏపీ మంత్రి, డోన్‌ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్‌ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. తనను కులం పేరుతో దూషించి ఇనుపరాడ్డులతో కారు అద్దాలను పగులగొట్టారని పీఎన్‌ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుగ్గనతో పాటు నగర పంచాయతీ ఛైర్మన్‌ చలంరెడ్డి, నాయకులు నాగరాజు, నాగేశ్వరరావు, మరో 30మంది బుగ్గన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు బేతంచర్ల హెడ్‌కానిస్టేబుల్‌ మాషుం బాషా తెలిపారు.

మైదుకూరు ఎమ్మెల్యే పైనా..
వైఎస్ఆర్‌ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలింగ్‌ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలూరులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సహా 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెనాలి ఎమ్మెల్యే పైనా కూడా..
తెనాలి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ తో అత‌ని ఏడుగురు అనుచ‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.. నిన్న పోలింగ్ జ‌రుగుతున్న స‌మయంలో ఎమ్మెల్యే నేరుగా ఓటు వేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే లైన్ లో నిల‌బ‌డిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.. దీంతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంపదెబ్బ కొట్టగా, అది చూసి షాకైన ఓటరు, ఆయనపైకి ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో అభ్యర్థి అనుచరులు ఓటరుని పోలింగ్ స్టేషన్ వద్ద చితకబాదారు. దీనిపై నేడు కేసు న‌మోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement