Friday, November 22, 2024

Spl Story | శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో పెరుగుతున్న చావులు.. ఏపీ, తెలంగాణ‌లో 1500 మందికి పైగానే

అమ్మా, నాన్నా నేను భ‌రించ‌లేక‌పోతున్నా.. న‌న్ను కాలేజీలో బాగా ఇబ్బంది పెడుతున్నారు. కావాల‌ని టార్చ‌ర్ పెడుతున్నారు. చ‌దువుకోవ‌డం కంటే చావ‌డ‌మే న‌యం అనిపిస్తోంది. వార్డెన్‌, తోటి స్టూడెంట్స్ ముందు కొడుతూ, తిడుతుంటే త‌ట్టుకోలేక‌పోతున్నా.. ఇది శ్రీ‌చైత‌న్య కాలేజీలో చ‌దువుతూ ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు ఓ విద్యార్థి రాసిన మ‌ర‌ణ వాంగ్మూలం.. ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీ‌చైత‌న్య‌, నారాయ‌ణ కాలేజీల్లో దాదాపు 1500 మందికి పైగానే విద్యార్థినీ, విద్యార్థులు ఆగ‌డాలు భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకుని కుటుంబానికి తీర‌ని శోకం మిగిల్చారు. ఈ కాలేజీలు ఇట్లాగే సాగితే.. ఇంకెంత మంది ఉసురు తీసుకోవాల్సి వ‌స్తుందో అని త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: చైతన్య నారాయణ కాలేజీల్లో మరణ మృదంగం వినిపిస్తోంది. ఒకటా..రెండా.. ఈ రెండు కార్పోరేట్‌ సంస్థలు చిదిమేసిన బతుకులు, చేసిన హత్యలు.. తమ కాసుల కక్కుర్తితో విద్యార్థులను బలిపీఠమెక్కేలా చేస్తున్న చర్యలపై ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. విద్యార్థులను అడుగడుగునా అనవసర వేధింపులు చేస్తుండడంతో తాము చదవుకోవడానికి వచ్చామా.. చచ్చిపోవడానికి వచ్చామా.. అని విద్యార్థులు ప్రశ్నిస్తున్న తీరు హృదయాలను ద్రవింపజేస్తున్నది.

- Advertisement -

ఉన్నత పాఠశాలల విద్యార్థులు మొదలుకొని, కాబోయే ఇంజనీర్లు, మెడికోలు కూడా ఇలాంటి ఘోరమైన మార్గాన్ని ఎంచుకున్న వైనాలు మనసున్న ప్రతివారిని కలచివేస్తున్నాయి. మానవత్వం ఉన్న వారందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. పాఠాలు తక్కువ.. బూతులు ఎక్కువ.. ప్రాణాలు తీసే వేధింపులు.. కులం వర్గం, ఆకారం, వ్యవహారం అన్నింటిపైనా సె-టైర్లు వేస్తూ బూతులు తిడుతూ విద్యార్థులను అడుగడుగునా కుంగతీస్తున్న తీరు, ఆత్మ్థసర్యం సడలేలా.. వ్యవహరిస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్రలో ఏటా 9 లక్షలమందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తుండగా, ఇందులో 70 శాతం మంది చైతన్య, నారాయణ కళాశాలల నుండి రాస్తున్నారు.

మార్కుల ఒత్తిడి, ఎదుగుతున్న విద్యార్థుల మేధస్సుల మీద ర్యాంకులు, మార్కుల జమిలి రంపపు కోత యథేచ్ఛగా సాగుతుండడంతో బలవన్మరణాలకు కారణమవుతోంది. మాకు మార్కులు ఎక్కువ రావాలని కాలేజీ వాళ్లు ఎక్కువ టార్చర్‌ చేస్తున్నారు. అది తట్టు-కోలేక వాడు చచ్చిపోయాడు. ఒత్తిడి భరించలేక వాడు మాతో కూడా మాట్లాడట్లేదు. దీంతోనే నిన్న రాత్రి పదిన్నరకు సూసైడ్‌ చేస్కున్నడు. అని షణ్ముఖ్‌ అనే నార్సింగి చైతన్యకళాశాల విద్యార్థి మీడియా ముందు తన మిత్రుడి మరణంపై వాపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్రలో మాత్రం ప్రస్తుతం చాలా తరగతి గదులలో విద్యార్థులు బయటకెళ్లి విషం తాగడం గురించీ, ఉరితాళ్లు పేనుకునే పద్ధతి గురించీ ఆలోచిస్తుండడం విషాదకర పరిణామం.

గుండె తరుక్కుపోయే ఘటనలు
చదువు మీదే కాదు, జీవితం మీద సైతం విరక్తి కలగడానికి కావలసిన అన్ని పరిస్థితులు చైతన్య, నారాయణ కళాశాలల్లో సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని నారాయణ కళాశాల బాధలు తట్టు-కోలేక గతంలో అదృశ్యమైన ఓ విద్యార్ధిని ‘నారాయణ కాలేజీ పిల్లలను చదువు పేరుతో చంపుతోంది. పిల్లలను కాపాడండి!’ అంటూ లేఖ రాసింది. ఈ నరకం విస్తృతి ఎంతో ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది. ఎన్నో మరణాలు.. మరెన్నో విషాదాలు. 1995 నుండి ఇప్పటిదాకా చైతన్య, నారాయణ కళాశాలల వేధింపుల కారణంగా 1500మంది పిల్లలు ఉరితాళ్ళకు, విషపుబాటిళ్ళకు బలయ్యారంటే.. కారణం యాజమాన్యాలు కాదని చెప్పగలరా అని విద్యార్థుల తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు.

నారాయణ, చైతన్య కాలేజీల్లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు? కళాశాలల్లో వసతుల పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు కాలేజీల్లో ఎంత మంది విద్యార్థులు మృతి చెందారు? తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని ఇంటర్‌ బోర్డును హైకోర్టు పలుమార్లు ఆదేశించినా.. ఈ రెండు కళాశాలలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘోరాలకు తాము కూడా బాధ్యులవుతున్నారు. చిన్నవయసులో చితికిపోతున్న విద్యార్థులను చూసి కూడా.. కఠినంగా వ్యవహరించలేక పోతున్నారు. కార్పోరేట్‌ కళాశాలల విషపరిణామాలు తెలిసినా.. ఈ రెండింటిపై ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఎన్నో ఆశలతో చదువుకోసం పంపిన తల్లితండ్రుల ఆశలు ఆవిరవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement