Friday, September 20, 2024

Atchyutapuram Blast – 16 కి చేరిన మృతులు

విశాఖ క్రైం : ప్రభ న్యూస్ – అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురంఫార్మా సెజ్లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు16 మృతి చెందారు.మరో 50మందికి పైగాగాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్యపెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

అచ్యుతాపురంఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు.భోజన విరామ సమయం మధ్యాహ్నం 1:30ప్రాంతంలో ఈ భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

- Advertisement -

భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.

క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కూలిపోయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు కార్మికులు చెబుతున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భయాందోళనలో ప్రజలు..

వరుస ప్రమాదాలపై స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బితుకు బితుకు అంటున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు దృష్ట్యా చాలా ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరగడంతో తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. పరిశ్రమల సేఫ్టీ నిర్లక్ష్యంతో తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాలలో కార్మికులు మృత్యువాత పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో అనేకమార్లు పలు పరిశ్రమలో ప్రమాదాలు జరిగిన అటు ప్రభుత్వాలు గాని ఇటు సంస్థ యజమాన్యాలు కానీ పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఘటన స్థలానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిశీలించారు.సహాయ చర్యలను ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement