Saturday, November 23, 2024

AP | ఒప్పందం ముగిశాక కొత్త రేటుకే విద్యుత్‌.. డిస్కమ్‌లకు కేంద్రం కళ్లెం

అమరావతి, ఆంధ్రప్రభ : విద్యుత్‌ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది.

ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కమ్‌లు అదే రేటుకి అదే జెన్‌కో ద్వారా విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. అప్పుడు కేంద్రం ఈ వెనులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కొంటే జెన్‌కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్‌కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్‌ (ఐఈఎక్స్‌) లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కమ్‌లకు గానీ విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు.

అదే విధంగా కేంద్ర ప్రభుత్వ – విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్‌ పూల్‌ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్‌ను డిస్కమ్‌లు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కల్పించింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్‌ను ఐఈఎక్స్‌లోనే విక్రయిస్తారు.

- Advertisement -

అంతా ఐఈఎక్స్‌లోనే..

విద్యుత్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్‌కోలు, డిస్కమ్‌లకు ఉన్న ప్రధాన మార్కెట్‌ ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్‌. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్‌ 27న ప్రారంభమైన ఐఈఎక్స్‌ 2017లో స్టాక్‌ మార్కెట్లో లిస్టెడ్‌ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్‌ క్రయ, విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు, 100కు పైగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, 1,600కుపైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్‌లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్‌లో 8,468 మిలియన్‌ యూనిట్ల లావాదేవీలు జరిగాయి.

యూనిట్‌ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ లావా దేవీలకు జెన్‌కోలు, డిస్కమ్‌ల నుంచి గరిష్ఠంగా యూనిట్‌కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్‌) వసూలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement